West Godavari Politics: ‘పశ్చిమగోదావరి’లో.. టిడిపి,జనసేన స్వీప్

గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో.. ఏడు నియోజకవర్గాల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. భీమవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 71,048 ఓట్లు లభించాయి.

Written By: Dharma, Updated On : September 15, 2023 5:39 pm

West Godavari Politics

Follow us on

West Godavari Politics: టిడిపి, జనసేన ల మధ్య పొత్తు కుదిరిన వేళ రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. పొత్తుల్లో భాగంగా జనసేనకు లభించే సీట్లు ఎన్ని? జిల్లాల వారీగా కేటాయించే సీట్లు ఇవేనంటూ ప్రచారం ప్రారంభమైంది . సోషల్ మీడియాలో అయితే జనసేనకు ఇచ్చే స్థానాలు ఇవేనంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే గోదావరి జిల్లాల్లో టిడిపి, జనసేన కూటమి స్వీప్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టే.. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కించి మరి చెబుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. రాజోలు నుంచి జనసేన అభ్యర్థి రాపాక మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో జనసేన 30 వేల ఓట్లకు పైగా సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే.. వైసిపి అభ్యర్థులు విజయం సాధించగలిగారు. అయితే ఈసారి టిడిపి, జనసేనల మధ్య పొత్తు కుదరడంతో వైసీపీ అభ్యర్థుల విజయం కష్టమే.

గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో.. ఏడు నియోజకవర్గాల గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. భీమవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 71,048 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీకి 53,788 ఓట్లు రాగా.. జనసేనకు 61, 951 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి, జనసేన ఓట్లు కలిపితే 1,15,739. నరసాపురం నియోజకవర్గానికి సంబంధించిఅధికార వైసిపికి 54,861 ఓట్లు లభించాయి. ఇక్కడ టిడిపికి 26,905ఓట్లు, జనసేనకు 48,892 ఓట్లు వచ్చాయి.జనసేన,టిడిపి ఓట్లు కలిపితే 75,797. తణుకు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి 75,133 ఓట్లు, టిడిపికి 73,276 ఓట్లు, జనసేనకు 31,796 ఓట్లు లభించాయి. ఇక్కడ టిడిపి,జనసేన కలిస్తే 1,05,075 ఓట్లు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసిపికి 70, 078 ఓట్లు లభించాయి. టిడిపికి 54,028 ఓట్లు, జనసేనకు 35,796 ఓట్లు వచ్చాయి. టిడిపి జనసేన కలిపితే 90,004 ఓట్లు. అచంట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి 66,013 ఓట్లు వచ్చాయి. టిడిపికి 53,366 ఓట్లు, జనసేనకు 13,943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి, జనసేన ఓట్లు కలిపితే 67,309, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసిపికి 48,945 ఓట్లు లభించాయి. టిడిపి అభ్యర్థి రామానాయుడు 67025 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ జనసేనకు 31, 721 రావడం విశేషం. ఇక్కడ టిడిపి, జనసేన ఓట్లు కలిపితే 99,746. ఉండి నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసీపీకి 71,048 ఓట్లు లభించాయి. టిడిపికి 82,374 ఓట్లు లభించడంతో ఆ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ జనసేనకు 24366 ఓట్లు లభించాయి. టిడిపి, జనసేన కలిస్తే 1,06,740 ఓట్లు లభించే అవకాశం ఉంది.

ఇలా లెక్కలు కట్టి.. టిడిపి జనసేన కూటమి పశ్చిమగోదావరిలో స్వీప్ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విశ్లేషణలు చూసి అధికార వైసీపీ కలవరపడుతోంది. టిడిపి, జనసేన లో జోష్ నెలకొంది.