YCP Third List: వైసిపి మూడో జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలుగా మారాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో దంపతుల మధ్య వివాదాలకు ఆజ్యం పోసేలా నిర్ణయాలు తీసుకోవడం విశేషం.టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఇచ్చాపురంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయలను ఇన్చార్జిలను నియమించడంతో కుటుంబంలోనే చిచ్చు రేపినట్టు అయ్యింది.
టెక్కలిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచినా తట్టుకుని నిలబడ్డారు. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని జగన్ ప్లాన్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. అక్కడికి కొద్ది రోజులకే దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి జగన్ కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో శ్రీనివాస్ అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. అటు కుటుంబ వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో శ్రీనివాస్ స్థానంలో ఆయన భార్య వాణి ని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పెద్దగా సహకరించిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో టిడిపిలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. దీంతో జగన్ యూటర్న్ తీసుకున్నారు. తిరిగి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కే బాధ్యతలు అప్పగించారు. దీంతో శ్రీనివాస్ భార్య వాణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా పిరియా సాయిరాజ్ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన భార్య విజయ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు సాయిరాజ్ ను తప్పించి ఆయన భార్యకు టికెట్ కట్టబెట్టడంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. 2009లో సాయిరాజ్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో పది స్థానాలకు గాను.. సాయిరాజ్ ఒక్కరే టిడిపి నుంచి గెలవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆయన టిడిపిలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడిచారు. అయినా సరే 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2019లో దక్కినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని భావించారు. కానీ ఆయనను తప్పిస్తూ.. భార్య విజయకు ఇన్చార్జిగా ప్రకటించడంపై సాయి రాజ్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికైతే వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది.