Munugode By Poll- Congress: మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఘోరాభవం ఎదురైంది. సిట్టింగ్ స్థానం కావడం, నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉండడంతో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, రెండు అధికార పార్టీల ధాటికి 8 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు మునుగోడు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇంతటి పరాభవాన్ని ఆ పార్టీ ఊహించలేదు. అధికారం లేకపోయినా.. సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్ కొట్టాడింది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక వచ్చిన కీలకమైన ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికలకు భిన్నంగా.. అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది.

ఆర్థిక, అంగ బలం ముందు.. ఫలించని వ్యూహాలు..
కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ కన్నా ముందే కదనరంగంలోకి దూకింది. కమిటీలు వేసింది. మండల స్థాయి కమిటీలు గ్రామస్థాయి కమిటీలు వేసి ముందే ప్రచారంలోకి దింపింది. స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కూడా బాధ్యతలు అప్పగించింది. అయితే టీఆర్‌ఎస్, బీజేపీల ఆర్థిక, అంగబలాల ముందు కాంగ్రెస్ వ్యూహాలు వెలవెలబోయాయి.
అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు..
మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్లతో పెకలించినట్టు అయిపోయింది. కనీసం గౌరవ ప్రదమైన ఓట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ తెచ్చుకోలేక పోయింది. చేతులు కాలిపోయిన తర్వాత.. ఆకులు పట్టుకున్న చందంగా.. అంతర్మథనం చేసుకుంటాం. తప్పులు సరిచేసుకుంటాం. ప్రజల మనసులు దోచుకుంటాం అనే డైలాగులే నేతల నుంచి వినిపిస్తున్నాయి.
ఓడినా గౌరవప్రదంగా లేకపోవడానికి ప్రధాన కారణం అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య పోరే ప్రధాన కారణం. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపిక నాటి నుంచి అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. కీలక నాయకులను రంగంలోకి దింపడంలోనూ అధిష్టానం విఫలమైంది.
కనిపించని రాహుల్ ప్రాభవం..
భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువనేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ.. ఎన్నికల ముందు తెలంగాణ గడ్డపై అడుగు పెట్టారు. కానీ ఉప ఎన్నికల్లో ఆయన ప్రాభవం కనిపించలేదు. మునుగోడు ప్రజలకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారని, వారికి ఒక పిలుపు ఇస్తారని అభ్యర్థి స్రవంతి ఆశించారు. కానీ ఆయన పన్నెత్తు మాట కూడా మునుగోడు గురించి చెప్పలేదు. అసలు ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నట్టుగా కూడా తెలియనట్టే వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ గురించిన చర్చ నియోజకవర్గంలో పెద్దగా సాగలేదు.

ఓటర్లపై వెంకటరెడ్డి వ్యాఖ్యల ప్రభావం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. అందుకే పార్టీ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది. కానీ ఆయన కాంగ్రెస్ తరఫున ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేదు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నేతలకు ఫోన్‌చేసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆ ఫోన్‌కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి మునుగోడులో కాంగ్రెస్ గెలవదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటల ప్రభావం నియోజకవర్గ ఓటర్లపై కచ్చితంగా పడిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉప్పు–పప్పు తిన్న రేణుకా చౌదరి వంటి ఫైర్ బ్రాండ్లు కనీసం కన్నెత్తి చూడలేదు. పోనీ.. ఉన్నవారైనా సరిగా ప్రయత్నం చేశారా? అంటే.. కేవలం మొక్కుబడి తంతుగా.. ప్రచారం నిర్వహించారు. వెరసి.. ఇప్పుడు డిపాజిట్లు కూడా దక్కని పాపాన్ని ఎవరు మోస్తారో.. ఎవరు మోయాలో.. చూడాలి!!