CM Jagan : అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో జగన్ కు గట్టి షాక్

దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి కదలిక వచ్చినట్లు అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో ప్రాధాన్యతాంశంగా మారనుంది.

Written By: NARESH, Updated On : November 3, 2023 6:51 pm
Follow us on

CM Jagan : జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యం పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. కేసు పురోగతిపై ఆరా తీసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని సిబిఐని ప్రశ్నించింది. సిబిఐతో పాటు ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్ తో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది. దీంతోఈ కేసులో కదలిక వచ్చినట్లు తేలింది.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ క్విడ్ ప్రోకు పాల్పడ్డారని సిబిఐతో పాటు ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11 కేసుల్లో 43 వేల కోట్ల రూపాయల అవినీతిని జరిగినట్లు అప్పట్లో నిర్ధారించారు. 2012 జూన్ లో జగన్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి సైతం 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2013 సెప్టెంబర్ 23న మద్యంతర బెయిల్ దక్కడంతో జగన్ జైలు నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి ఆయన బెయిల్లోనే గడుపుతున్నారు. అటు కేసు విచారణ కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు.

అసలు జగన్ అక్రమాస్తుల కేసులో కనీస పురోగతి లేదు. గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా మారింది. 2014లో 63 సీట్లతో విపక్ష నేతగా ఉన్న జగన్.. 2019లో మాత్రం కనివిని ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే గత పదేళ్లుగా 3041 వాయిదాలకు ఆయన హాజరు కాలేదు. ప్రజా జీవితంలో ఉన్నందున తాను కోర్టు విచారణలకు హాజరు కాలేనని సాకుగా చూపారు. ఈ తరుణంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యం, కేసును పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది.

ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసులో ఎందుకంత జాప్యం జరుగుతోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిటిషనర్ కోరినట్లు ఈ కేసు ఇతర రాష్ట్రాలకు ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీచేసింది. కేసు విచారణను జనవరి కి వాయిదా వేసింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి కదలిక వచ్చినట్లు అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో ప్రాధాన్యతాంశంగా మారనుంది.