
ఇప్పుడు ఏపీలో అన్నిటికంటే ప్రియమైనది ఏదో తెలుసా? ఇంకేముందీ ‘మందు’. అవును ఏపీలోని జగన్ సర్కార్ మద్యపాన నిషేధం దిశగా ఎప్పుడైతే మద్యం ధరలు రెండింతలు చేసిందో అప్పటి నుంచి ఏపీ జనాలు ఒర్రి చస్తున్నారు. ధరలకు తాళలేక పక్క రాష్ట్రాల నుంచి చీప్ మద్యం ఏపీకి పోటెత్తుతోంది. ఇక బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో దొరకకపోవడంతో తెలంగాణ నుంచి అది అక్రమంగా చేరుతోంది. ఏపీలో ఏవేవో పేర్లతో లోకల్ బ్రాండ్లను విపరీతమైన ధరలతో అమ్ముతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ విభాగాన్ని పెట్టి మరీ ఒక్క బాటిల్ బయట రాష్ట్రం నుంచి తెచ్చినా స్వాధీనం చేసుకొని కేసులు పెడుతోంది. దీంతో కొందరు హైకోర్టుకు ఎక్కగా.. వేరే రాష్ట్రం నుంచి ఒక్కో వ్యక్తి మూడు ఫుల్ బాటిల్స్ కు మించకుండా తెచ్చుకోవచ్చని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇదో లాభసాటి వ్యాపారంగా మారిందట..
హైకోర్టు తీర్పు రాగానే తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోంచి జనాలను పంపిస్తూ ఒక్కొక్కరిని మూడు బాటిళ్ల చొప్పున తీసుకొస్తున్నారు. కొందరిని ఇదే పనిమీద అటూ ఇటూ తిప్పుతున్నారు. చీప్, ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లు ఇప్పుడు ఏపీకి తెలంగాణ, కర్ణాటక, తమిళ నుంచి పోటెత్తుతున్నాయి.
ధర తక్కువ.. క్వాలిటీ బ్రాండెడ్ సరుకు కావడంతో వీటికి మంచి డిమాండ్ నెలకొంది. ఏపీలోని లోకల్ బ్రాండ్ల కంటే వీటినే తాగడానికి జనం ఎగబడుతున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వగానే ఇప్పుడు మద్యం దందా ఏపీలో జోరుగా సాగుతోందట.. వందలమాదిని ఇదే పనిమీద పెట్టుకొని తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారట.. సో ఇలా ఏపీ ప్రభుత్వానికి మద్యం ధరల పెంపు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు.