Internal Differences In YCP: వైసిపి క్రమశిక్షణ గల పార్టీ. ఇక్కడ అధినేత మాటే అల్టిమేట్. అంతకుమించి ఏమీ ఉండదు . ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న మాటే శిరోధార్యం. ఎంతటి కాకల తీరిన నాయకుడైనా అధినేత మాట వినాల్సిందే.. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు… ఇప్పుడు అంత సీన్ లేదు. ప్రతి నియోజకవర్గంలో పార్టీలో వర్గ కుమ్ములాటలు.. టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు నడుస్తోంది. వైసీపీ కీలక నాయకులు, మంత్రులు సైతం దీనికి అతీతం కాదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 70,80 నియోజకవర్గాల్లో వర్గ పోరు నడుస్తోంది. అధిష్టానానికి కలవరపాటుకు గురి చేస్తోంది.
చిత్తూరు జిల్లా నగిరి నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వరకు.. వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాంతరంగా కొందరు నాయకులు తెరపైకి వస్తున్నారు. టికెట్ తమకేనని కుండ బద్దలు కొడుతున్నారు.దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవర్ని సంపాదించుకొనివ్వకుండా తామే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతో వారిపై ఇతర నేతలు రగిలిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను తప్పించి వేరొకరిని అందలమెక్కించడం పై మరికొందరు ఆగ్రహంతో ఉన్నారు. ఇలా రకరకాల కారణాలతో చాలామంది నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులపై తిరుగుబాటుబావుట ఎగురవేస్తున్నారు. దీంతో వైసీపీలో వర్గ పోరు ఊహించనంతగా పెరిగిపోతోంది.
దాదాపు 80 నియోజకవర్గాల వరకు వైసిపి అంతర్గత పోరుతో సతమతమవుతోంది. చివరకు మంత్రి రోజా లాంటి నేతలకే ఓడిస్తామని అసమ్మతి నాయకులు తేల్చి చెబుతున్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే పనిచేయమని.. పనిగట్టుకుని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. మంత్రుల్లో సగం మందిది ఇదే పరిస్థితి. చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇలా ఈ జాబితాలో చాలామంది ఉన్నారు.
ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన పనిలేదు. స్వయంగా సీఎం వచ్చి టిక్కెట్ల మడత పేచీ తేల్చినా సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మూడు నెలల వ్యవధిలోనే శ్రీనివాస్ ను తప్పించి ఆయన భార్యకు ఇంచార్జ్ పోస్ట్ ఇచ్చారు. హిందూపురంలో కూడా సేమ్ సీన్. ముందున్న వారిని కాకుండా కొత్తగా మహిళా నేతను తెరపైకి తెచ్చారు. ఇవన్నీ పార్టీ అంతర్గత సమస్యలే. చాలామంది నాయకులను పిలిచి సహకరిస్తే.. ఎన్నికల అనంతరం మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే హామీ ఇచ్చారు. దీంతో నేతలు లైట్ తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే ఓడిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. హై కమాండ్ కు ఇది తలనొప్పి వ్యవహారంగా మారుతోంది.