Janasena BJP Alliance
Janasena BJP Alliance: తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. ఒకవైపు కాంగ్రెస్, వామపక్షాల పొత్తులు కొలిక్కి వస్తున్నాయి. ఇంకోవైపు బీజేపీ–జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. రెండు పార్టీల మధ్య ఒప్పందం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. జనసేనకు 7 నుంచి 12 వరకు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అమిత్‌షా, నడ్డాతో భేటీ తర్వాత సీట్ల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే తెలంగాణలో బీజేపీతో కలిసిన జనసేనను ఏపీలో మాత్రం పొత్తు చిక్కులు వీడడం లేదు. అక్కడ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇది బీజేపీకి నచ్చడం లేదు. అక్కడ టీడీపీ, జనసే, బీజేపీ పొత్తు పొడవడం లేదు. ఇందుకోసం జనసేనాని చేస్తున్న ప్రయత్నాలూ ఫలించడం లేదు.
తెలంగాణలో పొడిచిన పొత్తు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారైపోయింది. రెండు పార్టీల మధ్య ఒప్పందం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. జనసేనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 స్థానాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో సీటు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల మేధోమథనం తర్వాత జనసేనతో కలిసి వెళ్లాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మద్దతు కోరిన బీజేపీ..
ఇటీవల హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్‌తో చర్చించిన అంశాలను రాష్ట్ర బీజేపీ నేతలు, అధిష్టానానికి తెలియజేశారు. కాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. గురు, శుక్రవారాల్లో సీట్ల పంపకం కూడా కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.
జీహెచ్‌ఎంసీలో కలిసి రావడంతో..
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ఉండటంతో 48 కార్పొరేటర్లను కాషాయ పార్టీ గెలుచుకుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఈ ప్రతిపాదనను జనసేనాని ముందు పెట్టారు. ఇందుకు అధిష్టానం నుంచి కూడా అనుమతి ఇప్పించారని సమాచారం.
మరి ఏపీలో పరిస్థితి ఏంటి?
తెలంగాణ వరకు బీజేపీ, జనసేన పొత్తుకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి. నేరో రేపో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఐదేళ్లుగా ఏపీలో కలిసి నడుస్తున్న బీజేపీ–జనసేనల మధ్య పొత్తు మాత్రం కుదరడం లేదు. వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా జనసేనాని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ ఆశిస్తున్నారు. అయితే దీనికి బీజేపీ సమ్మతించడం లేదు. టీడీపీతో కలిసి పనిచేయడానికి బీజేపీ నో చెబుతోంది.
ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటన..
ఇదిలా ఉంటే.. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ములాఖత్‌కు వెళ్లిన జనసేనాని.. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేక కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. పొత్తులపై వెనకా ముందు ఆలోచన చేయకుండా, బీజేపీని సంప్రదించకుండా జనసేనాని నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రకటన తర్వాత బీజేపీ పెద్దలను పవన్ కలవలేదు.
అమిత్‌షా, నడ్డాతో భేటీ..
టీడీపీ–జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జనసేనాని బీజేపీ పెద్దలను కలిసే అవకాశం తెలంగాణలో పొత్తు రూపంలో వచ్చింది. ఈమేరకు బుధవారం(అక్టోబర్ 25)న సాయంత్రం 6 గంటలకు హోం మంత్రి అమిత్‌షా జనసేనానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాను కలువనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా తెలంగాణలో పొత్తు అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలు, పొత్తులపై కూడా సూచాయగా చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ కోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. పవన్ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు.
మొత్తంగా జనసేన తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు ఖరారైంది. కానీ, ఏపీలో బీజేపీతో పొత్తుపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అమిత్‌షాతో భేటీ తర్వాత పొత్త అంశంపై జనసేనాని ఏం ప్రకటిస్తారో అని ఏపీ బీజేపీ, జనసేన నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.