Thammineni Sitaram: స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి. ఆ పదవి చేపడుతున్న వారు ఎటువంటి రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయ వేదికలు పంచుకోకూడదు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. కానీ దానిని బ్రేక్ చేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్నారు. చీల్చిచెండాడుతున్నారు. తాను ముందుగా ఎమ్మెల్యేను.. తరువాతే స్పీకర్ నని తన భుజం తానే తట్టుకొని సమర్థించుకుంటున్నారు. అయితే ఆయన సొంత పార్టీ శ్రేణులపై అదే దూకుడు కనబరుస్తుండడంతో ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమే తమ ధ్యేయమన్న రీతిలో పావులు కదుపుతున్నారు.

తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన తమ్మినేని ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు ఓటమి చవిచూశారు.2019 ఎన్నికల్లో మాత్రమే గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేశారు. తరువాత టీడీపీలో చేరారు. అక్కడ నుంచి వైసీపీలోకి వెళ్లారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసినా ఓటమి తప్పలేదు. 2019లో మాత్రం జగన్ గాలి వీయడంతో గెలుపొందారు. దాదాపు రాజకీయ జీవితం కనుమరుగైందనుకున్నతరుణంలో విజయం దక్కింది. మంత్రి పదవిని ఆశించినా జగన్ ఇవ్వలేదు. స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అయితే మలివిడతలోనైనా మంత్రి పదవి దక్కుతుందని భావించిన తమ్మినేనికి చుక్కెదురైంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కీలక నాయకులు చేజారిపోయారు. వారి నుంచి ఇప్పుడు తమ్మినేనికి సవాల్ ఎదురవుతున్నాయి.
ఆమదాలవలస మండలంలో కోట బ్రదర్స్, చింతాడ రవికుమార్, పొందూరులో సువ్వారి గాంధీ వంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఒకేతాటిపైకి వస్తున్నారు. గత ఎన్నికల్లో తమ్మినేని గెలుపునకు సహకరిస్తే మమ్మల్ని తొక్కిపెట్టారని.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని శపథం పన్నుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్య కూన రవికుమార్ మరోసారి పోటీచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన తమ్మినేనికి స్వయాన మేనల్లుడు. తమ్మినేని టీడీపీని విడిచిపెట్టిన తరువాత కూన రవికుమార్ అదే పార్టీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో మాత్రం గెలుపొందారు. ప్రభుత్వ విప్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తమ్మినేని పై అసమ్మతి ప్రభావం రవికుమార్ కు లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో తమ్మినేని ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు చాలారకాలుగా హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. పైగా తమ్మినేని కుటుంబసభ్యలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గంలో ప్రవహిస్తున్న వంశధార, నాగావళిలో ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నది ప్రధాన ఆరోపణ. పైగా రాజ్యాంగేతర శక్తులుగా మారి పాలనలో కుటుంబసభ్యుల జోక్యం అధికమైందన్న ప్రచారం ఉంది. అటు సొంత పార్టీలో అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, కుటుంబసభ్యలపై అవినీతి ఆరోపణలు వెరసి.. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఎదురీదక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐ ప్యాక్ టీమ్ సర్వేలో కూడా ఇదే తేలినట్టు తెలుస్తోంది.