IMD: ఫిబ్రవరి నెల మూడో వారంలోనే దేశంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలు మినహా.. దేశం మొత్తం ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా తారస్థాయికి చేరుకున్నది. ఏసీలకు, కూలర్లకు, ఫ్యాన్ల కు డిమాండ్ పెరిగిపోతున్నది.. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ నమోదు కాలేదు. 28 నుంచి 32 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఎండా కాలాన్ని ఇప్పుడే చూపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా రోజువారి పనులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీరసానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు.
ఈసారి హాటెస్ట్ సిటీ అదేనట
ప్రతి ఏడాది ఎండాకాలంలో హాటెస్ట్ సిటీని జాతీయ వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ప్రతిసారి హాటెస్ట్ సిటీగా ఢిల్లీ ఉంటుంది. అయితే ఈసారి ఢిల్లీ కాకుండా బెంగళూరు హాటెస్ట్ సిటీగా మారుతుందట. అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలుస్తుందని భారతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జాతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. సిలికాన్ సిటీ లో ప్రస్తుతం 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఢిల్లీలో మాత్రం 27 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం విశేషం.. బెంగళూరు జాతీయ ఉద్యాన నగరిగా పేరుపొందినప్పటికీ.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు గత ఏడాది తీవ్ర నీటి కరువుతో బెంగళూరు నగరం నరకం చూసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. అయినప్పటికీ నీటి కరువుతో బెంగళూరు నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
బెంగళూరులో గత కొన్ని సంవత్సరాలుగా భవనాల నిర్మాణం అధికంగా సాగుతోంది. చెట్లు నరకడం నిరాటంకంగా సాగిపోతుంది. దీంతో బెంగళూరులో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శీతకాలంలోనూ 28 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయిందంటే బెంగళూరులో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండడంతో నీటి కరువు కూడా ఏర్పడుతోంది. గత ఏడాది బెంగళూరులో తాగునీటికి అసాధారణ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రజలు తాగినటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తీవ్రంగా ఆంక్షలు విధించడంతో పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ.. బెంగళూరు నగర శివారు ప్రాంత ప్రజలు నరకం చూశారు. తాగునీటి కోసం చాలా దూరం ప్రయాణించి తెచ్చుకున్నారు. తాగునీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కృషి చేసినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే వచ్చిందని కన్నడ మీడియా తన కథనాలలో పేర్కొంది.