Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు ముంపునకు గురవుతోంది. ఎటు చూసినా రోడ్లన్ని జలమయం అవుతున్నాయి. చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినా ముప్పు జరుగుతూనే ఉంది. ఎవరో చేసిన పాపానికి మరెవరో బలవుతారని తెలుస్తోంది. గత పాలకులు చేసిన నిర్వాకంతోనే నగరం ముంపునకు గురవుతోందని టీఆర్ఎస్, అధికార పార్టీ పాపమే ప్రజలను పీడిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరమంటేనే బాధల నగరంగా మారిపోతోంది. దీంతో ప్రజలెవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కాలనీలన్ని బుదరమయంగా మారడంతో ఏం జరుగుతుందో అని అందరిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో నగరం పరిస్థితిపై అందరిలో భయం కలుగుతోంది.

చినుకు పడితే చాలు చిత్తడే. ఎటు చూసినా బురదే దర్శనమిస్తోంది. దీంతో మహానగరమైనా మురికి కూపంగా తలపిస్తోంది. పాలకులు ఎప్పటికప్పుడు బాగు చేస్తామని చెప్పి తప్పించుకుంటూనే ఉన్నారు. అయినా ప్రజల్లో ఆశ చావడం లేదు. ఏ నాయకుడైనా తమ గోడు పట్టించుకోకపోతారా అని ఎదురు చూస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ నగర్, సరూర్ నగర్, లింగోజీ గూడ, కుర్మగూడ, దిల్ సుఖ్ నగర్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాల్లోోని కాలనీలు నీట మునిగాయి.
శుక్రవారం రాత్రి కురిసిన వానకు ఓ మొసలి కొండపై ప్రత్యక్షమవడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వరదల్లో కొట్టుకొచ్చి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి గడ్డి అన్నారంలోని సినిమా థియేటర్లోకి నీరు చుట్టిముట్టింది. దీంతో గోడ కూలిపోవడంతో పార్కింగ్ లో ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి.
మహానగరాలపై వరుణుడి పంజా కొనసాగుతూనే ఉంది. గతంలో చెన్నై, ముంబై, కేరళ తదితర ప్రాంతాలను వణికించిన వాన హైదరాబాద్ ను మాత్రం ఎప్పుడు భయపెడుతూనే ఉంది. దీంతో వర్షం పడితే చాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని బెంగ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు పట్టించుకుని రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించడంపై వాపోతున్నారు.