Guests Announced For Pelli SandhaD: టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు ఎప్పటినుండో మంచి ఆదరణ ఉంది. వీటిలో ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1996లో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమాని ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు అతని కొడుకు రోషన్ హీరోగా ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పెళ్లి సందD’ ని రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. వారి పర్యవేక్షణలో వస్తున్న ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తుంది. ఈ సినిమాలో కొత్త అమ్మాయి శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేష్ బాబు చేత విడుదలైన సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

కరోనా తర్వాత కోలుకుంటున్న తెలుగు చిత్రసీమ ఇప్పుడిప్పుడే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంది. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నారు సినిమా నిర్మాతలు మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌తో పాటు ప్రతీ ప్రమోషన్ ఈవెంట్‌లో కూడా రాఘవేంద్ర రావు పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో కూడా నటిస్తుండటం మరో విశేషం. సుదీర్ఘ సినీ ప్రయాణం తరువాత సినీ కెరీర్‌లో తెర వెనుక ఉన్న ఆయన తొలిసారిగా తెర మీదకు రావడంతో ఈ సినిమాకు మరో బలం చేకూరింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ముందు అక్టోబర్ 10వ తేదీన ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడమే కాదు, ఇద్దరు ముఖ్య అతిథులు కూడా వస్తున్నట్టు తెలిపింది. ఫిలిం నగర్లోని జె ఆర్ సి కన్వెన్షన్లో జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. సూపర్ హిట్ సాధించిన ‘పెళ్లి సందడి’ సినిమా సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో తెలియాలంటే ఇంకో ఐదు రోజులు వేచిచూడాల్సిందే.