తెలంగాణ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. గతేడాది కూడా ఇదే స్థాయిలో ముందుగా కురిసిన వర్షాలతో రైతులు సంబరపడిపోయారు. ఈసారి కూడా అదే కోవలో వానలు పడుతుండడంతో అన్నదాతలు ఖరీఫ్ పనుల్లో మునిగిపోయారు. విత్తనాలు వేస్తూ పొలం పనుల్లో బిజీగా మారిపోయారు.
ఆదివారం కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, నారాయణ గూడ, హిమాయత్ నగర్, కింగ్ కోఠి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేటలో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కూకట్ పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్రమత్తమైన సిబ్బందిని అధికారులు అందుబాటుల ఉంచారు. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వర్షాలు కురుస్తాని చెప్పారు. ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్లు వరకు వ్యాపించి ఉంది. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్ గడ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్లు వ్యాపించి ఉంటుందని వివరించారు.