Artificial Heart : మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.. ఫలితంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వెలుగుచూస్తున్నాయి.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి.. మనదేశంలో ఏటా సంభవించే మరణాల్లో గుండె జబ్బుల వాటా 15% గా ఉంది. గత దశాబ్దం క్రితం వరకు ఇది ఐదు శాతంగా ఉండేది.. ఒక దశాబ్దంలోనే పరిస్థితి ఇంతలా మారింది అంటే గుండె జబ్బులు ఎలా మనుషులపై ముప్పేట దాడి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఐఐటీ కాన్పూర్ గుడ్ న్యూస్
ఇక గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటి కాన్పూర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా కృత్రిమ గుండెను తయారు చేసింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో దీనిని జంతువులకు అమర్చి పరీక్షించనుంది.. ఒక వేళ ఆ ప్రయోగం విజయవంతమయితే రెండు సంవత్సరాలలో మనుషులకు అమర్చనుంది.. ఐఐటీ కాన్పూర్ కు చెందిన పదిమంది శాస్త్రవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగులతో కలిసి ఈ గుండెను చేశారు. ప్రస్తుతం మనదేశంలో గుండె మార్పిడి అవసరం ఉన్నవారికి ఇతరులు దానం చేస్తేనే లభిస్తోంది. అన్ని సందర్భాల్లో గుండె లభించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కాన్పూర్ శాస్త్రవేత్తలు అడుగులు వేయడం వైద్యశాస్త్రంలో గొప్ప పరిణామం. ఇక మనదేశంలో గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.. ఇది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నది. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. దీనివల్ల స్టంట్ల వినియోగం అనివార్యంగా మారింది.
1950లోనే..
కృత్రిమ గుండె అనేది 1950 సంవత్సరంలోనే కనుగొన్నారు.. అయితే దీనిని అనేక ప్రయోగాల తర్వాత 1982లో జార్విక్ అనే రోగికి అమర్చారు. 1937 లో సోవియట్ శాస్త్రవేత్త వ్లాదిమిర్ డెమిఖోవ్ అనే శాస్త్రవేత్త ఒక కుక్కకు తాను తయారు చేసిన కృత్రిమ గుండెను అమర్చారు.. ఇక కృత్రిమ గుండెకు సంబంధించి అమెరికన్ శాస్త్రవేత్త పాల్ వించెల్ మొదటి పేటెంట్ పొందాడు. అయితే ఇతడు వృత్తిగతంగా వెంట్రిలాక్విస్ట్.. వించెల్ కు వైద్య రంగంలో కొంత పరిచయం ఉంది.. హెన్రీ హీమ్ లీచ్ అనే వ్యక్తి అతనికి సహాయం చేశాడు..1969 లో కృత్రిమ గుండెను లియోట్టా అనే వ్యక్తికి అమర్చారు. కొద్ది రోజులకే అతడు కన్ను మూశాడు. అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ జార్విక్, విల్లెం కోల్ఫ్ 1982లో కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు. డాక్టర్ బన్నీ క్లార్క్, విలియం డివ్రీస్ కలిసి ఓ రోగికి 1982లో గుండెను అమర్చారు.. అతడు 112 రోజులు జీవించి తర్వాత మరణించాడు.. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రెండువేల కంటే తక్కువ మంది రోగులకు కృత్రిమ హృదయాలు అమర్చారు.. అయితే వీరిలో చాలామంది కన్నుమూశారు.. ఇక ప్రస్తుతం భారత దేశంలో కాన్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ గుండెను తయారు చేసిన నేపథ్యంలో .. హృద్రోగాలతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.