Homeజాతీయ వార్తలుDowry: నేను కట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను

Dowry: నేను కట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను

Dowry: “నేను కట్నం తీసుకోను, ఇవ్వను, ప్రోత్సహించను” ఇదీ కేరళలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ సమయంలో ప్రతి విద్యార్థి ఇవ్వాల్సిన హామీ. ఈ మేరకు స్వీయ అంగీకార పత్రం పై విద్యార్థులు సంతకం చేయాల్సిందే. దీనికి తోడు తల్లిదండ్రుల సంతకం కూడా ఉండాలి. అప్పుడే విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. భవిష్యత్తులో వారు వర కట్నం తీసుకున్నా లేదా అడిగినా ఇస్లతో పాటు యూనివర్సిటీ వారికి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై యూనివర్సిటీ వాస్తవాలు తెలుసుకొని, ఆరోపణలు నిజమని తెలిపే సంబంధిత వ్యక్తుల డిగ్రీని శాశ్వతంగా రద్దుచేస్తుంది.

కేరళ విశ్వవిద్యాలయాలకు కులపతిగా వ్యవహరిస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రెండు సంవత్సరాల క్రితం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా కసరత్తు కొనసాగుతోంది. వరకట్న వేధింపుల కేసులు దేశంలో ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన “ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022” సర్వే పలు దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఈ జాబితాలో 50.4% తెలంగాణ రెండవ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 75 శాతం గృహహింస కేసులతో అస్సాం రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 48.9% కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇక గృహహింసకు సంబంధించి అత్యధిక కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ముఖ్యంగా వరకట్నం, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.

ఇక కేరళ అనుసరిస్తున్న వరకట్న వ్యతిరేక విధానంపై తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీనివాస్ మాధవ్ దీని మీద అధ్యయనం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఈ విధానం అక్కడ అమల్లోకి వచ్చింది. ఇది అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గణనీయమైన మార్పుకు నాంది పలికింది. ఈ క్రమంలో ఇలాంటి విధానం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆయన ప్రతిపాదన పంపారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కేరళ ప్రభుత్వాన్ని నిర్ణయాలను పరిశీలించి, విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే త్వరలో ఉన్నత విద్యా మండలి, మహిళ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular