
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ వ్యూహాలు చూసి అవాక్కవ్వడం రాజకీయ విశ్లేషకుల వంతవుతోంది. అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించడం ద్వారా జగన్ ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వడంతో పాటు ఆ పార్టీల నేతలు నోరు మెదపకుండా చేశాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐకి అప్పగించడం జగన్ వేసిన రాజకీయ ఎత్తుగడ అని ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్వేది ఘటన జరిగినప్పటి నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తూ నిరసన కార్యాక్రమాలు చేపట్టడంతో పాటు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించాయి. అంతర్వేదిలో రథం ఏ విధంగా దగ్ధమైందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పార్టీలు మాత్రం రాజకీయపరమైన ప్రయోజనాల కోసం ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందో పూర్తి వివరాలు వెల్లడి కాకముందే ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి.
ఒక మతానికి చెందిన ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ, ఇతర పార్టీలు విమర్శలు చేస్తూ జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. అయితే జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతిపక్షాలు మతాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న వికృత క్రీడను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని తెలుపుతున్నారు. ఏపీ పోలీసులతో విచారణ జరిపించినా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది.
అంతర్వేది ఘటనను సీబీఐకు అప్పగించడంతో జగన్ సర్కార్ కేసును కేంద్రానికి అప్పగించినట్లైంది. ఇకపై బీజేపీ, జనసేన విమర్శలు చేయాలన్నా చేయడం సాధ్యం కాదు. జగన్ ను ఇరకాటంలో పెట్టాలని ప్రత్యర్థి పార్టీలు భావించగా తాజా నిర్ణయంతో జగనే ప్రత్యర్థి పార్టీలను తిప్పలు పెడుతున్నాడని చెప్పాలి.