
Andhra Pradesh: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జరుగుతున్న చర్చ జమిలీ. దేశంలో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల శాసనభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నిక. ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది? వచ్చే సమస్యలు ఏంటీ? అనే చర్చ ఒకవైపు సాగుతూనే ఉంది. అయితే.. కేంద్రం నిర్ణయించుకుంటే.. ఇది అసాధ్యం కాదని కూడా చెబుతున్నారు. పైగా.. బీజేపీకి లోక్ సభలో కావాల్సినంత మెజారిటీ ఉంది. ఇలాంటి మెజారిటీ మరోసారి వస్తుందని చెప్పలేని పరిస్థితి. అందుకే.. ఈ టర్మ్ లోనే జమిలీ ఎన్నికల చట్టాన్ని కూడా తేవడం ఖాయమనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే.. ఇదే జరిగితే చాలా రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి. మరి, ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది? అన్నది చర్చ.
ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 2019లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ కోలుకోలేదనే చెప్పాలి. జరిగిన ప్రతి ఎన్నికలోనూ పరాజయమే ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీకే సీట్లు దక్కాయి. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికలోనూ అధికార పార్టీనే జండా ఎగరేసింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మరింత నైరాశ్యంలో కూరుకుపోతున్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే.. ఈ పరిస్థితి మారుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. చంద్రబాబు ఏయే కారణాలు చూసుకొని ఈ మాట చెబుతున్నారోగానీ.. జమిలీ కోసం ముందస్తుగా ఎన్నికలు వస్తే టీడీపీదే విజయం అని అంటున్నారు. టీడీపీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ.. అది ఎలా సాధ్యమన్నదే ప్రశ్న.
ఏపీలో ఇప్పటి వరకు వైసీపీకి పెద్దగా వ్యతిరేకత లేదు. జరిగిన ప్రతి ఎన్నికా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పైపెచ్చు.. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. జనాల కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరుగా నగదు బదిలీ జరుగుతుండడంతో.. ప్రజలు ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించట్లేదు. కరోనా వంటి ఆపత్కాలంలోనూ ఈ సంక్షేమాన్ని కొనసాగించారు జగన్. ఈ కారణం వల్లనే.. రాష్ట్ర ఖజానా ఓటిపోయిందని, దివాలా అంచున ఉందని ఎన్ని ప్రచారాలు చేస్తున్నా.. ప్రజల్లో వ్యతిరేకత అన్నది పెద్దగా కనిపించట్లేదు. ఈ పరిస్థితి ముదిరి, జనాల్లో వ్యతిరేకత కనిపించాలంటే.. ఐదేళ్ల పాలన పూర్తి కావాల్సిందే. అప్పటికి కూడా ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనే దాన్ని బట్టి.. ఫలితాలను అంచనా వేయొచ్చు.
పరిస్థితులు ఇలా ఉంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తమదే విజయమని టీడీపీ నేతలు ఎలా భావిస్తున్నారు అన్నదే ఎవరికీ అర్థంకాని ప్రశ్న. ముందస్తు ఎన్నికలు వస్తే.. జగన్ ఎదుర్కొన్ని విజయం సాధించడం అనేది టీడీపీకి సాధ్యం ఎలా అవుతుంది అనే చర్చ సాగుతోంది. ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే విజయం సాధ్యమని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ.. కాషాయ నేతలు ఆయనకు దూరం దూరం అంటున్నారు. జనసేనాని కూడా ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. టీడీపీకే దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. 2024 వరకు వేచి చూస్తే.. అవకాశం ఉండొచ్చని అంటున్నారు.