
BRS On AP: కడుపులో లేనిదే కౌగిలించుకుంటే వచ్చిద్దా అని ఊరికే అనలేదు. ఆంధ్రా వాళ్లను సన్నాసులు, దద్దమ్మలన్న కేసీఆర్, అదే నోటితో ఆంధ్రాను ఉద్దరిస్తామని బీరాలు పలుకుతున్నారు. ఏపీలో కాలుమోపేందుకు సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి హామీలు ఇస్తున్నారు. తెలంగాణా వాదం ముగిసినట్టేనా?, ఆంధ్రాలో ఏ విధమైన అభివృద్ధి చేసి చూపిస్తారు? విభజన హామీలు, ప్రత్యేక హోదా తదితర సమస్యలపై కేసీఆర్ వైఖరి ఏంటి? అన్న ప్రశ్నలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.
ఆంధ్రాలో ప్రధానంగా టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన వంటి పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు ఓటు బ్యాంకు ఉంది. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రచిస్తున్నారు. కొత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రాలో చోటు కల్పించేంత రాజకీయ శూన్యత అంటూ ఏమీ లేదు. పైగా ఆ పార్టీకి ఇక్కడ నాయకత్వ లేమి సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. కానీ, ఆంధ్రాలో కూడా తమ నాయకత్వం అవసరముందని కేసీఆర్ అనడం వెనుక ఆయన అవసరం తప్పా ప్రజలపై ప్రేమ లేదని స్పష్టంగా తెలుస్తుంది.
బీజేపీపై సమరం సాగించడానికి కేసీఆర్ ఒక్కరే సమర్థుడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఓ సభకు ఏపీలోని ఆ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసమీకరణ చేసి పంపారట. అది కూడా ఉత్తరాంధ్ర నుంచే కాబట్టి విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించారు. ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని, అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామని అన్నారు. వాస్తవ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకపోయినప్పటికీ, తన రాజకీయ ఎదుగుదలకు విశాఖ ఉక్కును వాడుకుంటున్నారని అర్థమవుతుంది.

వాస్తవానికి తెలంగాణాకు, ఆంధ్రాకు మధ్య చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణాకు ఏపీ నుంచి ఎన్నో నిధులు రావాలని కేసీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు. విద్యుత్ బకాయిలు, నీటి వినియోగం, సరిహద్దు గ్రామాల వివాదాలు ముఖ్యంగా ఉన్నాయి. కేంద్రం ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయడం లేదని కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత అంటున్నారు. నిన్నటి వరకు తెలంగాణాకే పరిమితమైన ఆయన పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా మార్చేశారు. ఆంధ్రాలో బలపడాలని చూస్తున్నారు. మరి ఇటువంటప్పుడు రెండు రాష్ట్రాలను కలిపేసి అభివృద్ధి చేసి చూపిస్తానని కేసీఆర్ అనొచ్చు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో అంతులేని ప్రశ్నలకు కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానాలు రాలేదు. రాబోవు ఎన్నికల సందర్భంగా ఆయన ఇస్తున్న హామీల్లో ఈ అంశం ప్రస్తావన ఉంటుందా? తెలంగాణావాదం ముగిసిపోయి సమైక్య వాదం వినబడుతుందా అనేది వేచి చూడాల్సిందే. బీజేపీ నేతలు అంటున్నట్లుగా కేసీఆర్ ఆంధ్రా ద్రోహి కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనపై ఉంది.