
కరోనా సెకండ్ వేవ్ ఏపీలో విజృంభిస్తోంది. 20 వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాలు కూడా 500లకు పైగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కర్నూల్లో ఎన్440కె వైరస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ వ్యక్తి ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదైంది.
దేశవ్యాప్తంగా మూడు రకాల వైరస్ లు విజృంభిస్తున్నాయని ఇటీవల వైద్య శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందులో భాగంగానే తీవ్రత ఎక్కువగా ఉన్న ఎన్440 రకమైన వైరస్ ఏపీలో ప్రవేశించిందని, అందువల్లనే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ప్రజల్లో భయాందోళన పుట్టించిన చంద్రబాబుపై సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 155, 505 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ఏపీలో వైరస్ ఎలాంటిదన్న విషయాన్ని పక్కనబెడితే ప్రజల ప్రాణాలు కాపాడడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో కాదని, దేశ వ్యాప్త సమస్య అని అంటున్నారు. అందువల్ల కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన పానిక్ సృష్టించినట్లవుతుందా..? అని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య దృష్ట్యా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతరుల అభిప్రాయాలను చెప్పినంత మాత్రాన వారు అలజడి సృష్టించే వారెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. దేశంలో కొంతమంది వైద్య శాస్త్రవేత్తలు మూడో వేవ్ ఉంటుందని, రకరకాల వైరస్ లు ప్రవేశించాయని చెబుతున్నారు. అంతమాత్రాన వారిపై కేసులు నమోదు చేస్తారా..? అని అంటున్నారు.