AP Industries : ఏపీలో కుల, ప్రాంతీయ రాజకీయాలు అధికం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ .జాడ్యం పెరిగింది. అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేసినట్టే.. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కూడా జగన్ అదే పంథాను కొనసాగిస్తున్నారు. పార్టీకి, తనకు ప్రయోజనమనుకుంటే ఎంతవరకైనా వెళతారు.దాని పర్యవసానమే ఏపీ నుంచి అమర్ రాజా గ్రూప్ కంపెనీ నిష్క్రమణ. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమ రాయలసీమ నుంచి తరలుతుంటే కుహానా మేథావులు కనీసం పట్టించుకోవడం లేదు. సీమ యువత ఆకలిని తీర్చే పరిశ్రమలు తరలుతున్నా నోరు మెదపడం లేదు. కనీసం స్పందించే సాహసం చేయడం లేదు. రాజకీయాల కోసం.. ఓ పార్టీని అధికారంలోకి తేవడానికి కంకణం కట్టుకుని పనిచేసే ఈ బృందానికి కళ్లెదుటే రాయలసీమ యువత ఉపాధి నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదు.

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ఒకవైపు మూడింటికీ కట్టబడి ఉన్నామని చెబుతూనే.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకున్నామని సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు అదే ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ హైకోర్టుకు మద్దతుగా కర్నూలులో గర్జన నిర్వహిస్తోంది. దీనికి మాత్రం ఏపీ సమాజంలో మేధావులుగా చలామణి అవుతున్న వారు మద్దతు తెలుపుతున్నారు. పోనీ కర్నూలుకు హైకోర్టు వచ్చిందనే అనుకుందాం? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అందులో స్థానికులకే ప్రాధాన్యమంటుందా? రాయలసీమ రీజియన్ కు రిజర్వేషన్ వర్తిస్తుందా? అంటే అదీ లేదు. దాని గురించి ఆలోచించని సదరు మేధావులు వస్తున్న హైకోర్టును కర్నూలు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రజల్లో భావోద్వేగాన్ని సృష్టించడానికి మాత్రం రెడీ అవుతున్నారు.
వైసీపీ సర్కారు వస్తే రాయలసీమ రత్నాల సీమ అవుతుందని భ్రమ కల్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయానికి ఇదో నమ్మకం ఒక కారణం. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరాశే ఎదురైంది. ఉన్న పరిశ్రమలకు రక్షణ లేకపోగా.. కొత్త పరిశ్రమల జాడ లేకపోయింది. కియా పరిశ్రమ ఏర్పాటు తరువాత అనుబంధ పరిశ్రమలు ఏపీ వైపు చూస్తాయని భావించారు. కానీ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతల వైఖరితో ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. చివరికి నిర్మాణ పనులు ప్రారంభించిన జాకీ వంటి పరిశ్రమ కూడా సైడ్ అయ్యింది. వేరే రాష్ట్రాల కు వెళ్లిపోయింది. చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి కల్పించేందుకు అమెరికా నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన అమర్ రాజా కూడా తన దారి తాను చూసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఏపీలో విస్తరణ లేనట్టేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది.
అతి పెద్ద జియో ప్లాంట్ సైతం రాయలసీమకు దూరమైంది. మూడున్నరేళ్ల కాలాన్ని ఒక్కసారి స్థుతించుకుంటే రాయలసీమలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధిని దూరం చేసిన ఘనత మాత్రం వైసీపీ సర్కారుది.. ఆ పార్టీ నేతలదే. ప్రభుత్వ పెద్దల వికృత క్రీడ, స్థానిక నేతల దౌర్జన్యాలు వెరసి.. అసలు పెట్టుబడులు వరకూ ఎందుకు? ఏపీ వైపు చూసేందుకే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. దీనిపై మాత్రం మేధావులు అని పిలవబడే జగన్ మద్దతుదారులు కనీసం మాట్లాడడం లేదు. పైగా యువతలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు మాత్రం హైకోర్టు అనే సెంటిమెంట్ అస్త్రాన్ని వినియోగించడం విమర్శలకు గురిచేస్తోంది.