
పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వెర్రిగా కొనుగోలు చేస్తున్న రాపిడ్ కిట్ల నాణ్యతపై దుమారం చెలరేగింది. దానితో వాటిని ఉపయోగించడం వెంటనే నిలిపివేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత వైద్య పరిశోధన మండలి (ఇసిఎంఆర్) ఆదేశించింది. రెండు రోజులపాటు వాటి నాణ్యతను పరిశీలించి, ఏమి చేయాలో చెబుతామని తెలిపింది.
కరోనా వైరస్‌పై సత్వర ఫలితాల కోసం వినియోగించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అంటూ రాజస్థాన్ వాటి ఉపయోగాన్ని నిలిపివేసి, ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకోంది. ఈ విషయమై రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలన ప్రకారం కేవలం 5.4 శాతం మాత్రమే సరైన ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘుశర్మ వెల్లడించారు.
కనీసం 90 శాతం ఖచ్చితమైన ఫలితాలు రావలసి ఉంది. రాజస్థాన్‌లో జైపూర్ సహా పలు హాట్‌స్పాట్లలో 170 ఫరీక్షలు జరుపగా తప్పుడు ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈసరికే కరోనా ఉన్నవారికి సైతం ఆ కిట్లు ఉపయోగించి పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని వివరించారు.
దాంతో కిట్స్ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయని, వైద్య కమిటీ సలహా మేరకు వాటిని ఉపయోగించడం నిలిపివేసి ఐసీఎంఆర్‌కు తెలియజేశామని మంత్రి చెప్పారు.
ఐసీఎంఆర్ నుంచి ఇంకా సమాధానం రాలేదు.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో ఫలితాలు వచ్చేందుకు 6 గంటల వరకు పడుతుంది. అదే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అయితే 15 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. కరోనా వైరస్ హాట్‌స్పాట్లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఉపయోగించాలని ఐసీఎంఆర్ సూచించింది. దీంతో భారత్ సుమారు 5 లక్షల టెస్ట్ కిట్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా వీటి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కూడా గత వారమే వీటిని తెప్పించుకొంది. దానితో వీటి నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.