కరోనా వైరస్ ను నిర్ధారించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తో చేస్తున్న పరీక్ష ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజస్థాన్, రాష్ట్రానికి పంపిన కిట్స్ బాక్స్ లలో, కిట్స్ సంఖ్య తక్కువగా ఉందని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలు కేంద్రానికి పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. దింతో ఏపీ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు వ్యక్తంచేసాయి. అయితే వీటి ఉపయోగంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో వీటిపై పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్.. వీటితో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు కొనసాగుతాయని జగన్ సర్కారు ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. వీటిని మరింత వేగవంతం చేయడానికి ఈ మధ్యే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. వీటి ధరలపై ఓవైపు విపక్షాలు విమర్శలు చేస్తుండగానే.. కిట్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఐసీఎంఆర్ రెండు రోజుల పాటు ఈ కిట్లతో పరీక్షలు నిర్వహించొద్దని సూచించింది. అయితే క్షేత్రస్దాయిలో సిబ్బంది వీటిని పరీక్షించి క్లీన్ చిట్ ఇవ్వడంతో తిరిగి వీటితో పరీక్షలు నిర్వహించుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతి మంజూరు చేసింది.
ఏపీలో ర్యాపిడ్ కిట్లతో సంబంధం లేకుండానే ఇప్పటివరకూ 48 వేల 34 టెస్టులు నిర్వహించినట్లు సీఎం జగన్ కు అధికారులు నివేదిక సమర్పించారు. ర్యాపిడ్ కిట్లు రావడంతో వీటితో 14 వేల 423 టెస్టులు నిర్వహించారు. ర్యాపిడ్ కిట్లతో కేవలం పది నిమిషాల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న జాబితాలో ఏపీ రెండో స్ధానానికి చేరుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీని మినహాయిస్తే అత్యంత వేగంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ లో నిలిచింది.