IAS Officer Unconstitutional Power India: సాధారణంగా మనం రాజకీయ నాయకులను అత్యంత శక్తివంతులైన వారిగా భావిస్తుంటాం.. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరని అనుకుంటాం. కానీ రాజకీయ నాయకులను మించిపోతున్నారు నేటి కాలంలో అధికారులు. ముఖ్యంగా కొంతమంది బ్యూరో క్రాట్ లు సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంపాదన మీద విపరీతమైన యావ పుట్టింది కాబట్టి.. అక్రమ అర్జనకు అధికారుల అండ కావాలి కాబట్టి.. అటువంటి అధికారులు తమకు తాముగా స్వీయ శక్తిని పెంచుకొని వ్యవస్థలకు మించి ఎదుగుతున్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ మంత్రి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగర శివారులో ఓ గ్రామంలో భూముల కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆ భూములను ఇవ్వకపోతే వారిని అంతం చేస్తారని బెదిరించినట్టు వార్తలు వినిపించాయి. వారికి ప్రతిపక్ష పార్టీ అండగా నిలిచింది. వారు ఇచ్చిన ఆధారాలను విలేకరుల ఎదుట ప్రదర్శించింది. ఆ మంత్రి కుమారుడు.. బంధువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.. ఈ నేపథ్యంలో ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు ఓ ఐఏఎస్ అధికారి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఆ అధికారి మంత్రి కుటుంబ సభ్యులతో మిలాఖత్ అయ్యారని.. ఆయన అండదండలతోనే మంత్రి కుటుంబ సభ్యులు రెచ్చిపోతున్నారని ఆ ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు.. ఆ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ అధికారి పేరును పదేపదే ప్రస్తావించిన నేపథ్యంలో.. ఆయన గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి అధికార పార్టీలోనే కాదు.. గత అధికార పార్టీలోనూ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్య భూమిక పోషించారు. నాడు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులో ఆ ఐఏఎస్ అధికారి తనకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. భూములను మొత్తం నచ్చిన వాళ్లకు కట్టబెట్టారు. ఏళ్ల తరబడి ఆయన అదే పోస్టులో ఉన్నారు.. ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం మాత్రమే కాదు.. సొంత ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారు.. అప్పట్లో ఓ రాజకీయ పార్టీకి ఆ అధికారి భారీగా విరాళం కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అధికారి రెవెన్యూ విభాగంలో కింగ్ పిన్ మాదిరిగా వ్యవహరించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అదే శాఖలో కొనసాగుతున్నాడు. అంతేకాదు అంతకుమించి అనే స్థాయిలో దోపిడికి పాల్పడుతున్నాడు. సదరు అధికారి గురించి ఇటీవల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజం. కాకపోతే, ఆ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా..ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నాడు ఆ అధికారితో సదరు కీలక ప్రతిపక్ష నాయకుడు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు. దీనినిబట్టి అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికారం లేనప్పుడు మరొక విధంగా మాట్లాడటం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిందనే సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
