Homeజాతీయ వార్తలుRahul Gandhi- PM Modi: మోదీ కళ్లల్లో నాకు భయం కన్పించింది.. రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్!

Rahul Gandhi- PM Modi: మోదీ కళ్లల్లో నాకు భయం కన్పించింది.. రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్!

Rahul Gandhi- PM Modi
Rahul Gandhi

Rahul Gandhi- PM Modi: కాంగ్రెస్‌ నేతల రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం అమలు చేసినందుకు విపక్షాలన్నీ ఏకమై రాహుల్‌కు అనుకూలంగా కేంద్రానికి, ప్రధాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. అనర్హత వేటు పడిన 24 గంటల తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మీడియా ముందుకు వచ్చారు. మోదీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. అదానీపై ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. పార్లమెంట్‌లో అదానీ గురించి అడిగినప్పుడు ప్రధాని మోదీ భయపడ్డారని, ఆయన కళ్లల్లో భయాన్ని తాను చూశానని తెలిపారు. ఇలాంటి అనర్హతలు తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టినా.. మోదీకి ప్రశ్నలు వేస్తూనే ఉంటానని తెలిపారు.

క్షమాపణలు చెప్పను..
‘మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని నేను చాలా సార్లు చెప్పాను. అందుకు ఉదాహరణలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకు నాకేం జరిగిందో ప్రజలంతా చూశారు. సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా ప్రసంగాన్ని తొలగించారు. బ్రిటన్‌లో నేను అనని మాటలను అన్నట్లు చూపించారు. సాక్షాత్తు కేంద్రమంత్రే పార్లమెంట్‌లో అసత్యాలు వల్లించారు. ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారు. అయినా నేను ప్రశ్నించడం ఆపను. ఈ దేశం నాకు ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇచ్చింది. అందుకే ఈ దేశ ప్రజల కోసం నేనేమైనా చేయడానికి వెనుకాడను. నిజం మాట్లాడటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేదే లేదు. నా పేరు సావర్కర్‌ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది’ అని రాహుల్‌ స్పష్టం చేశారు.

అదానీకి మోదీ మద్దతు ఎందుకు..?
అదానీ వ్యవహారంపై స్పీకర్‌కు అన్ని ఆధారాలతో రెండు లేఖలు రాశానని రాహుల్‌ తెలిపారు. అయినా సమాధానం రాలేదు. దీని గురించి స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి మరీ అడిగానన్నారు. ఆయన ఓ నవ్వు నవ్వి.. తానేం చేయలేనని చెప్పి.. చాయ్‌కి ఆహ్వానించారని తెలిపారు. అదానీ, మోదీకి చాలా ఏళ్లుగా స్నేహబంధం ఉందని, గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే వారి మధ్య విడదీయరాని సంబంధాలు ఉన్నాయని వివరించారు. అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందెవరు? అని ప్రశ్నించారు. ఆ పెట్టుబడుల్లో కొన్ని రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయని తెలిపారు. వాటిపై రక్షణ శాఖ ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. అత్యంత అవినీతి పరునికి ప్రధాని ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారని నిలదీశారు. దీనికి మోదీ సమాధానం చెపాల్సిందే అని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ సర్కార్‌ అనర్హత పేరుతో నాటకాలాడుతోందని దుయ్యబట్టారు.

Rahul Gandhi- PM Modi
Rahul Gandhi- PM Modi

ఈ సందర్భంగా మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష గురించి విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. న్యాయపరమైన విషయాలు చాలా సున్నితమైనవని, వాటిపై తాను స్పందించాలనుకోవడం లేదని సమాధానం దాటవేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular