Homeజాతీయ వార్తలుటీఆర్ఎస్ ను గద్దె దించే విషయంలో నేను బ్రాండ్ అంబాసిడర్

టీఆర్ఎస్ ను గద్దె దించే విషయంలో నేను బ్రాండ్ అంబాసిడర్

-కేసీఆర్ కుటుంబం ఇంకెన్నాళ్లు రాజ్యమేలాలి?

– తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలేమిటో చెప్పాలి
-తెలంగాణ అమర వీరుల త్యాగాలను వృథా పోనివ్వం
-టీఆర్ఎస్ ను గద్దె దించే వరకు విశ్రమించను
-తెలంగాణ రైతాంగ, నిరుద్యోగ సమాజం తరపున పోరాడే అంబాసిడర్ ను నేనే
-హుజూరాబాద్ లో గెలుపు బీజేపీ పక్షమే….టీఆర్ఎస్ డిపాజిట్ కోసం కొట్లాడాల్సిందే

కేసీఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని తెలంగాణలో రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలో కొత్తగా ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్డున పడేసిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం ఐదుగురికి కొలువులిచ్చుకున్నారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు కేసీఆర్ కుటుంబ పాలనను భరించాలి? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు.

టీఆర్ఎస్ ను గద్దె దించే విషయంలో నేను బ్రాండ్ అంబాసిడర్ ను. టీఆర్ఎస్ పాలనలో నష్టపోతున్న రైతాంగ, నిరుద్యోగ, అణగారిన ప్రజల పక్షాన పోరాడే విషయంలో నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా.’’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఏకపక్షమేనని చెప్పిన బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ అక్కడ డిపాజిట్ కోసం కొట్లాడాల్సిందేనని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 32వ రోజు బెజ్జంకి మండలంలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో వేలాది మంది ప్రజలు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. బండి సంజయ్ కుమార్ తోపాటు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాజ్ కుమార్ చౌహాన్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కిసాన్ మెర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్వీ సుభాష్ జె.సంగప్ప, దరువు ఎల్లన్న, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలంలోపాటు ఆదిలాబాద్ జిల్లా నుండి టీఆర్ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

– అనంతరం వేలాది మందిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
• నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన బెజ్జంకి మండల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వరి వేస్తే ఉరే గతి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండు. కేంద్రం చెప్పకపోయినా సోయి తప్పి మాట్లాడుతుండు. రైతులను భయపెడుతున్నడు. కేసీఆర్ వ్యాఖ్యలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నరు. ఆత్మహత్యలు చేసుకున్నరు.
• మొన్నటి వరకు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటానని చెప్పిన కేసీఆర్ కేంద్రంతో పని లేదని చెప్పారు. ఇప్పుడు మాట తప్పిండు.
• అసలు బియ్యానికి, రైతుకు ఏం సంబంధం. వడ్లు పండిస్తరు. అమ్ముతారు. వడ్లు మొత్తం కొనేది కేంద్రం. అసలు ఈ విషయంలో కేసీఆర్ కు సంబంధమేముంది? మిల్లర్ల దగ్గర కమీషన్ల కోసం బ్రోకర్ పాత్ర మాత్రమే పోషిస్తున్నడు.
• దేశంలో పండే పంటను ఏ విధంగా ఎగుమతి చేయాలి? మార్కెటింగ్ చేయాలనే అంశంపై అన్ని రాష్ట్రాల్లోని సీఎంలతో కేంద్రం మీటింగ్ పెడితే కేసీఆర్ తప్ప సీఎంలందరూ వెళ్లారు. అక్కడ తమ తమ రాష్ట్రాల్లో పండించిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ఒప్పందాలపై సీఎం సంతకాలు చేశారు. కేసీఆర్ వెళితే తెలంగాణలో పండించిన పంటనంతా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది.
• ఒకసారి పత్తి వేయొద్దంటడు. ఒకసారి సన్న వడ్లు వద్దంటడు. ఇప్పుడేమో వరి వేస్తే ఉరే గతి అని అంటున్నడు. నేను చెబుతున్నా…తెలంగాణలో పండించే ప్రతి గింజను కొనేలా కేంద్రాన్ని నేను ఒప్పిస్తా. అవసరమైతే ఈ విషయంలో కేసీఆర్ మెడలు వంచుతా.
• భారీ వర్షాలవల్ల టీఆర్ఎస్ హయాంలో గత ఏడేళ్లుగా రైతులు పంట నష్టపోతూనే ఉన్నారు. అయినా ఇంతవరకు వారికి కేసీఆర్ ప్రభుత్వం సాయం అందించిన పాపాన పోలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు ఈ గతి పట్టేది కాదు.
• రాష్ట్రంలో ఫ్రీ యూరియా ఇస్తానన్నడు. మాట తప్పిండు. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తానన్నడు. నకిలీ విత్తనాల కేంద్రంగా మార్చిండు. కేసీఆర్ మనుషులే నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులకు నష్టం చేస్తుండు.
• రైతు బంధు ఇస్తూ మిగిలిన సబ్సిడీలు, సంక్షేమ పథకాలన్నీ బంద్ చేసి రైతుల పొట్టకొడుతున్నడు కేసీఆర్.
• వర్షాలతో పేదల ఇండ్లు మునిగిపోతున్నయ్. ఆదుకోవడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల ఊసే లేదు. కేంద్రం తెలంగాణకు 2.91 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఆ డబ్బులను దారి మళ్లిస్తున్నడే తప్ప ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడం లేదు.
• నేను కేసీఆర్ కు సవాల్ చేసిన….తెలంగాణలో పేదలెవరూ నిలువ నీడ లేకుండా ఉండకూడదు. 3 లక్షల ఇండ్లు కడితే మరో 10 లక్షల ఇండ్లయినా కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత నాది. అవసరమైతే ఇద్దరం కలిసి ఢిల్లీ పోయి మోదీని అడుగుదామని కూడా చెప్పిన. అయినా దాట వేస్తుండే తప్ప పేదలకు మాత్రం ఇండ్లు కట్టివ్వడం లేదు.
• నిరుద్యోగులను నిలువునా మోసం చేసిండు. ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఇంట్ల మాత్రం ఐదుగురికి కొలువులు ఇప్పించుకుండు. తెలంగాణ కోసం 1400 మంది బలిదానాలు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం భోగాలు అనుభవిస్తోంది.
• కనీసం నిరుద్యోగ భ్రుతి ఇస్తానని మాట ఇచ్చి తప్పిండు. ఆ హమీ అమలు చేసి ఉంటే ఈపాటికే ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షకుపైగా అందేది. హోంగార్డులు వెట్టి చాకిరి చేస్తున్నరు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నడు.
• వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వలంటీర్లను, స్టాఫ్ నర్సులను, ఆర్టీసీ ఉద్యోగులను తొలగించి రోడ్డు పడేసిండు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థతి కల్పించిండు. ఆనాడు ఉద్యమం కోసం బలిదానాలు చేసుకుంటే….తెలంగాణ వచ్చాక ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి.
• అందుకే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ మెడలు వంచేందుకే పాదయాత్ర చేస్తున్నం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతు చూస్తాం. హుజూరాబాద్ వెళ్లి కాషాయ జెండా సతా చూపుతాం.
• బీజేపీకి భయపడి కాంగ్రెస్ తో కేసీఆర్ మిలాఖత్ అయ్యిండు. బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ర్పచారం చేయిస్తున్నడు. బీజేపీ ఏనాడూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీలదే.
• కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదు. మోదీ వద్దకు పోయి వంగి వంగి దండాలు పెడుతడు. బయటకొచ్చి ఫోజులు కొడుతుండు.
• పేదలకు ఆపదొస్తే కనీసం పరామర్శించిన నేత కేసీఆర్. గట్టిగా వర్షం వస్తే సిరిసిల్ల మునిగిపోతోంది. అయినా కొడుకు రాడు. తండ్రి రాడు.
• కేటీఆర్ అసెంబ్లీలో నిన్న ప్రభుత్వానికి బండి సంజయ్ అంబాసిడర్ అంటున్నడు. కేటీఆర్…నేను మీ ప్రభుత్వాన్ని దించే వరకు అంబాసిడర్ ను నేను. రైతులను, దళితులను మోసం చేసినవ్. రైతు, దళిత సమాజం తరపున నిలబడి కొట్లాడే బ్రాండ్ అంబాసిడర్ నేనే. నీ ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటంలో బ్రాండ్ అంబాసిడర్ ను నేనే.
• తెలంగాణ కోసం 1400 మంది త్యాగాలు చేసిండ్రు. కేసీఆర్, ఆయన కుటుంబం ఏం త్యాగం చేసిండ్రు? వారెందుకు ఇంకా రాజ్యం ఏలాలి? వాళ్లను ఇంకా ఎన్నాళ్లు భరించాలి? పేదల రాజ్యం రావాలి. అమరుల త్యాగాలు వ్రుథా కానివ్వం.
• పేదల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ. కోవిడ్ సమయంలో అన్ని పార్టీలు ఇంటికే పరిమితమైతే ప్రాణాలకు తెగించి కిట్లు, మందులుసహా చెప్పులు కూడా అందించిన పార్టీ బీజేపీ.
• పేదలెవరూ పైకి రావొద్దని గొర్లు, బర్లు ఇస్తూ అక్కడికే పరిమితం చేస్తున్నరు? ఇప్పుడు అవి ఐపోయినయ్. ఇప్పుడు నాటు కోళ్లకు వచ్చిండు. ఇంటికో 5 నాటు కోళ్లు పంచుతడట. అందుకోసం రూ.120 కోట్లు ఇస్తడట. సిగ్గుండాలి ఈ సీఎంకు…
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు వస్తే….తెలంగాణ వచ్చినాక మద్యం ద్వారా వస్తున్న ఆదాయం రూ.30 వేల కోట్లు.
• మీకు డబుల్ బెడ్రూం రావాలన్నా, ఫించన్ రావాలన్నా…ఇంకే సంక్షేమ పథకం రావాలన్నా మందు తాగితేనే ఇస్తానని కేసీఆర్ ఛెబుతుండు. పగలు మందు తాగాలి. ఇంటికెళ్లి ఇల్లాలిని కొట్టాలనేది ఆయన ఫిలాసఫీ.
• నన్ను బెజ్జంకి రావొద్దని కొందరు టీఆర్ఎస్ నేతలు అంటున్నరు. బెజ్జంకి నాది. బరాబర్ వస్తా. ఎంఐఎం సవాల్ చేస్తే పాతబస్తీకి పొయి తొడగట్టి సవాల్ చేసి కాషాయ జెండా ఎగరేసినం.
• బెజ్జంకి మండలంలో ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. అభివ్రుద్ది లేదు. ఇక్కడ స్వామి దేవాలయానికి రూ.17 కోట్లు ఇస్తానని చెప్పి శఠగోపం పెట్టినోడు కేసీఆర్. ఇక ప్రజలకేం చేస్తాడు. కన్నతల్లికి తిండి పెట్టనోడు…పిన్న తల్లికి బంగారం పెడతాడా? బెజ్జంకి నా మండలమే అని ఘనంగా చెప్పుకునే కేసీఆర్ ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదు.
• బెజ్జంకి మండల ఉపాధి 16.20 కోట్లు, మౌలిక 22.36 కోట్లు, మొక్కల ప 10.29 కోట్లు, ఆర్దిక సంగటం రూ.12.26 కోట్లు, మరుగుదొడ్ల కోసం 4.40 కోట్లు, ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 10 లక్షలు, ఒక్కో వైకుంఠ ధామం నిర్మాణానికి రూ. 11,13,701, ప్రకృతి వనానికి రూ. 4,23,103, నర్సరీ నిర్మాణానికి రూ. 1,56,314, డంప్ యార్డ్ కోసం రూ. 2,50,396, చెత్త సేకరణ కోసం ఒక్కో ట్రై సైకిల్ రూ. 15 వేలు, ఒక్కొక్క ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ. 14 లక్షలు ఇచ్చింది.
• కోవిడ్ వస్తే పేదలు పిట్టల్లా రాలుతున్నరు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయమంటే కేసీఆర్ చేయడు. ఆరోగ్యశ్రీ సరిగా అమలు కాదు. కోవిడ్ ను ఆ పథకంలోకి తీసుకురారు.
• హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్ కోసం వెంపర్లాడాల్సిందే. బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. హుజూరాబాద్ లో దళిత బంధు ఇస్తానన్న కేసీఆర్ మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడెందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ ను నిలదీయాలి.
• ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ మెడలు వంచేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాజ్ కుమార్ చహార్ : రైతు సోదరీ సోదరమణులకు నమస్కారం(తెలుగులో). పాదయాత్రలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్ లో నేను, బండి సంజయ్ పక్క పక్కనే కూర్చుంటాం. దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తోంది. ఎందుకంటే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ అంతటా గ్రామ గ్రామాన చేస్తున్న పాదయాత్రను దేశం మొత్తం చూస్తోంది.
• భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు తెలంగాణ రైతులకు అందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతోంది. కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజల ను రెచ్చగొట్టేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.
• పాదయాత్రలో బండి సంజయ్ తో కలిసి నడుస్తుంటే కొందరు రైతులు ఆపి భారీ వర్షాలవల్ల పంట తీవ్రంగా నష్టపోయాం. అని పైర్లు చూపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా సాయం అందుతుందా? అని అడిగితే లేదని రైతులు జవాబిచ్చారు. నిజానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన ఇక్కడ అమల్లోకి వస్తే…రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియంను చెల్లించి ఉంటే రాష్ట్రంలోని పంట నష్టపోయిన రైతాంగానికి ఈరోజు నష్టపరిహారం అందేది.
• దేశవ్యాప్తంగా రైతులకు భూ సార పరీక్షల కార్డులు అందజేసి ఏ పొలంలో ఏ పంట వేయాలనే అంశంపై భూసార పరీక్షలు నిర్వహిస్తుంటే….తెలంగాణకు భూసార పరీక్షల కోసం కేంద్రమే నిధులిచ్చినా కేసీఆర్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. రైతులపట్ల ఆయనకు ఏమాత్రం శ్రద్ధ లేదు. తన కుటుంబం బాగుంటే చాలనుకుంటున్నారు.
• డీఏపీ బస్తా ధర పెరిగి రూ.2400లకు చేరుకుంటే….. రైతుల కోసం కేంద్రం ఆ భారాన్ని మోస్తూ రూ.1200లకే బస్తా డీఏపీ అందజేస్తున్నారు.
• మీకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్యబీమా కార్డులు వచ్చాయా? ..లేదుకదా…ఇది మరీ అన్యాయం. పేదలకు రోగమొస్తే నయా పైసా ఖర్చు లేకుండా రూ.5 లక్షల వరకు చికిత్సకయ్యే మొత్తాన్ని ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రమే భరిస్తోంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ అమలు పర్చకపోవడం చాలా అన్యాయం. పేదలు రూ.లక్షలు వెచ్చించి ఎలా చికిత్స చేసుకోగలరు?
• ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని మాట తప్పారు. ఇది చాలా ద్రోహం. రైతులు నిలువునా మోసం చేశారు.
• తెలంగాణ దేశంలో అంతర్భాగం. ఇక్కడ ప్రజల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం బీజేపీ క్రుషి చేస్తోంది. బీజేపీకి, టీఆర్ఎస్ కు చాలా తేడా ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ బీజేపీ. అయోధ్యల్ రామ మందిరం నిర్మిస్తామని చెప్పి ఆ పని చేస్తున్న పార్టీ బీజేపీ. 370 ఆర్టికల్ రద్దు తో కాశ్మీర్ ను అందాల కాశ్మీర్ గా చేసింది.
• తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి తీసుకురావడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ ప్రజా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version