
Hyderabad Rains: Hyderabad sinking again .. High alert to the people: హైదరాబాద్ ను వాన విడవడం లేదు. పోయిన కరోనా లాక్ డౌన్ లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ మునిగి ఎంత నష్టం వాటిల్లిందో అందరం చూశాం. తెలంగాణ సర్కార్ కుటుంబానికి రూ.10వేలు చొప్పున పరిహారం కూడా చెల్లించింది. ఆ ఉపద్రవం కళ్లముందే కదలాడుతున్న వేళ భాగ్యనగరంలో మళ్లీ వాన దంచికొడుతోంది.
హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. అంబర్ పేట, గోల్సాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, మీర్ పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, కోటి, అబిడ్స్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది.
జోరు వానల ధాటికి చరిత్రలో తొలిసారి ముసారాంబాగ్ వంతెనపైనుంచి మూసీ నీరు ప్రవహిస్తుండడం వాన తీవ్రతకు అద్దంం పడుతోంది. గత రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక వాన తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని.. అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు వెళితే మంచిదని సూచిస్తున్నారు.