Hyderabad Real Estate: ఏ క్షణాన కూలి కుతుబ్ షా నా నగరాన్ని నిండా జనంతో నింపు అని దేవుడిని వేడుకున్నాడో.. ఆయన కోరినట్టుగానే ఇప్పుడు హైదరాబాద్ మినీ ఇండియా అయిపోయింది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భవనాలు, అవకాశాలు కల్పించే కంపెనీలు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, మరాఠీ.. ఇంకా ఎన్నో భాషల సమ్మేళనంగా విరాజిల్లుతోంది హైదరాబాద్. లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అదే స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బయోడైవర్సిటీ, ఐటీ కారిడార్.. ఇలా ఒకటేమిటి రకరకాల అధునాతన ప్రాంతాలకు ఆలవాలంగా మారింది. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి సంస్థ నివేదిక ప్రకారం స్థిరాస్తి వ్యాపారంలో హైదరాబాద్ కని విని ఎరుగని స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ దెబ్బకు పూణే, ముంబై లాంటి నగరాలు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్ ఎందుకంటే
దేశంలో బెంగళూరు, పూణే తర్వాత ఆ స్థాయిలో ఐటీ పెట్టుబడులను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది. మ రిముఖ్యంగా బహుళ జాతి సంస్థలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాదులోనే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎందుకంటే దక్కన్ పీఠభూమి ప్రాంతానికి చెందిన హైదరాబాద్ ఐటీ కంపెనీల సర్వర్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు అమెజాన్ కంపెనీ ని తీసుకుంటే సిలికాన్ వ్యాలీలో డాటా సెంటర్ ఉంది. అంతకు రెండింతల విస్తీర్ణంతో హైదరాబాదులో డాటా సెంటర్ ఓపెన్ చేసింది. దీనిని బట్టి హైదరాబాదుకు బహుళ జాతి సంస్థల యాజమాన్యాలు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కావలసినంత భూమి ఉండడం కూడా ఆ కంపెనీల రాకకు ప్రధాన కారణం. ఇక ఈ సంవత్సరం హైదరాబాద్ కు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. జనవరి నుంచి సెప్టెంబర్ దాకా 2,400 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో సుమారు 2000 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రియల్టీ లోకి మళ్లాయి. ఫీనిక్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు నగరంలో కొత్త కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడమే ఈ వృద్ధికి కారణమని తెలుస్తోంది. గత రెండేళ్లు కోవిడ్ వల్ల రియాల్టీ రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్ రియాల్టీ రంగం 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక గత ఏడాది సంస్థ గత పెట్టుబడుల్లో 94 శాతం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విభాగమే ఆకర్షించింది. ఇందులోకి ఎనిమిది వందల అరవై నాలుగు మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆఫీస్ స్పేస్ డెవలపర్లు తమ పోర్ట్ ఫోలియోలను తదుపరి దశ విస్తరణ కోసం వృద్ధి మూలధనాన్ని పెంచడం లేదా తగ్గించడం కోసం లిక్విడేట్ చేశారని తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాదులో అభివృద్ధి చెందే ప్రాంతాల్లోని కార్యాలయాల మార్కెట్ స్థితిస్థాపకత, దీర్ఘకాలిక వృద్ధి, నాణ్యమైన ఆస్తులపై పెట్టుబడిదారులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
గిడ్డంగులదే హవా
కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పోరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, ప్రొపైటరీ బుక్స్, పెన్షన్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ ఫండ్స్_ కం_ డెవలపర్స్, ఎన్ బీ ఎఫ్ సీ, సావరిన్ వెల్త్ ఫండ్స్ రిట్స్ ( రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) ఇవన్నీ కూడా సంస్థాగత పెట్టుబడులతో కలిసి ఉంటాయి. అలాగే ఈ ఏడాది మొదటి నుంచి పెట్టుబడిదారులు గిడ్డంగుల విభాగంలో పెట్టుబడులను అన్వేషించారు. ఈ ఏడాది మూసే నాటికి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నివాస రంగం కుయ్యో మొర్రో
వాణిజ్యపరంగా రియాల్టీ బాగానే ఉన్నా నివాస రంగం విషయానికి వచ్చేసరికి కుయ్యో మొర్రో అంటున్నది. కరోనా వల్ల రెండేళ్లు పెట్టుబడులు రాకపోవడం, ఆశించినంత మేర నగదు లేకపోవడం వల్ల నివాస రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడం, నిర్మాణపరమైన అనుమతులు వెంటనే రాకపోవడం, పైగా రుణాల మంజూరు విషయానికి వచ్చేసరికి బ్యాంకర్ల నిష్క్రియా పరత్వం వల్ల నివాస రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పైగా ఇంటి నిర్మాణానికి వాడే సిమెంట్, ఇనుము, ఇసుక, ఇటుక, ఇతర సామగ్రి ధరలు భారీగా పెరగడంతో అనివార్యంగా ఫ్లాట్ల ధరలు పెంచాల్సి వస్తున్నది. దీంతో ఆశించినత మేర ఇళ్ల కొనుగోలు జరగడం లేదు. ఐటీ ప్రొఫెషనల్స్ ఉండే గచ్చిబౌలి, మాదాపూర్, నానక్ రామ్ గూడ వంటి ప్రాంతాల్లో మాత్రమే నివాసాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక హైదరాబాద్ రియాల్టీ రంగంలో ప్రధాన కంపెనీలైన జనప్రియ, అపర్ణ, జయభేరి ఒకప్పుడు లెక్కకు మిక్కిలి ప్రాజెక్టులతో కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేసేవి. అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం మై హోమ్ గ్రూప్ మాత్రమే కొద్దో ప్రాజెక్టులు చేపడుతోంది. ఆఫీస్ స్పేస్ కు భారీగా డిమాండ్ ఉండడంతో దాదాపు అన్ని కంపెనీలు కమర్షియల్ వైపు తమ మార్గాన్ని మళ్లించాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ రియాల్టీ రంగంలో హైదరాబాద్ తోపు. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే గనుక చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు ఇతర ప్రాంతాలు హైదరాబాద్ వెనుకే ఉండటం గమనార్హం. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్వరగా రిటర్న్స్ లభిస్తుండటంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ భారత దేశ స్థిరాస్తి రాజధానిగా మారే అవకాశాలు ఎంతో దూరంలో లేవు.