KCR : పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో.. ప్రజలలో కోల్పోయిన పట్టును సాధించడానికి భారత రాష్ట్ర సమితి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిరసనలు.. ఆందోళనలు.. ధర్నాలు వంటివి నిర్వహిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత రాష్ట్ర సమితి కోసమే వందల కొద్ది యూట్యూబ్ చానల్స్..వెబ్ సైట్ లు, ట్విట్టర్ హ్యాండిల్స్ పనిచేస్తున్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతున్నాయి కూడా. వీటికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమౌతూనే ఉంది. అయితే భస్మాసురా హస్తంలాగా.. ప్రజల్లో వస్తున్న మైలేజ్ ను మరింత పెంచుకోవాల్సింది పోయి భారత రాష్ట్ర సమితి స్వీయ తప్పులు చేస్తోంది. అవి పార్టీ లైన్ ను ప్రజల్లోకి నెగిటివ్ గా తీసుకెళుతున్నాయి.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్టుగా ఒక లేఖ గురువారం నుంచి తెలుగు మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అందులో కెసిఆర్ ను ఉద్దేశించి ఆయన కుమార్తె సంధించిన ప్రశ్నలను తెలుగు మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. గులాబీ మీడియా ఈ లేఖల విషయాన్ని పక్కన పెట్టినప్పటికీ.. గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగం కూడా దీనిని పూర్తిగా విస్మరించినప్పటికీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాసినట్టుగా ఉన్న ఈ లేఖలో అనేక ప్రశ్నలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. గులాబీ సుప్రీంకు ఆయన కుమార్తె సంధించిన ప్రశ్నలలో ప్రముఖమైనది.. ఇటీవలి 25 సంవత్సరాల వేడుకలో బిజెపిపై కెసిఆర్ నోరు మెదపకపోవడం.. ఇప్పుడు మాత్రమే కాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు కేంద్రంలోని బిజెపిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం విధానం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అరెస్టు అయిన నాటి నుంచి బిజెపి నేతలను గులాబీ నాయకులు పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రశ్నించడం తప్ప.. పైగా ఆయన ఇటీవల కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలోనే కేటీఆర్ కలిసినట్టు ప్రచారం జరిగినప్పటికీ అసలు విషయం వేరే ఉందని జనాలకు అర్థమైంది. ఎప్పుడైతే కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసి వచ్చారో.. ఆ తర్వాతే పరిణామాలు వేగంగా మారిపోయాయి. కవితకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆమె తీహారు జైలు నుంచి విడుదలైంది.
Also Read : కెసిఆర్ ప్రసంగంలో పస తగ్గిందా..?
జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తన రాజకీయ ప్రస్తానాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతిని బలోపేతం తీసుకోవడంపై దృష్టి సారించారు. అయితే ఇదే సమయంలో ఆమె సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని అనడం సంచలనం సృష్టించింది. ఒకరకంగా ఇది కెసిఆర్ పరిపాలనను ప్రశ్నించినట్టే. సాధారణంగానే ప్రశ్నను కెసిఆర్ తట్టుకోలేరు. అలాంటిది సొంత బిడ్డ ఇలా ప్రశ్నిస్తే ఆయన మాత్రం ఎలా ఊరుకుంటారు.. అందువల్లే ఆమెను దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిజెపి పై ఎందుకు 25 ఏళ్ల వేడుక సభలో మాట్లాడలేదని కవిత నేరుగా ప్రశ్నించారు.. అంటే ఈ ప్రశ్న ద్వారా బిజెపితో కేసీఆర్ ములాఖాత్ అయ్యారా? అనే సంకేతాలను కవిత జనాలకు ఇచ్చినట్టు అయిందని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు బిజెపితో కలిసిపోతారనే ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ గులాబీ సుప్రీం ను ప్రశ్నించారు. అయితే ఆ సభలో ఆపరేషన్ కగార్ పై మాత్రమే మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం నిజంగానే గమనార్హం. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ సంధించిన ప్రశ్నల మాదిరిగానే గులాబీ సుప్రీం వ్యవహార శైలి ఉండడం.. గులాబీ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా కమలం+గులాబీ కలిసిపోయాయని ప్రచారం చేస్తుండడం విశేషం.. కెసిఆర్ కుమార్తెనే ఇలాంటి ప్రశ్న వేయడంతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చినట్టయింది.. కొంతమంది గులాబీ నాయకులు కవిత రాసిన లేఖలు ఫేక్ అని.. రేవంత్ రెడ్డి సృష్టి అని చెబుతున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి ఈ డ్యామేజ్ ని గులాబీ నేతలు ఎలా కవర్ చేస్తారో చూడాలి.