హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీజేపీ ఇప్పటికే పాదయాత్ర ద్వారా ఓటర్లకు దగ్గర కావాలని చూస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పేరుతో దళితులకు చేరువ కావాలని భావిస్తోంది. ఇంకా కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి ప్రకటనపై దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో ద్విముఖ పోటీ మాత్రమే నెలకొంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అభ్యర్థి ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పలువురు చెబుతున్నారు.
హుజురాబాద్ బరిలో ఎలాగైనా విజయం దక్కించుకోవాలని పార్టీలు యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ పార్టీ విధానాలతో ప్రజలను ఆకర్షించేందుకు పాట్లు పడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే ప్రజాదీవెన యాత్ర పేరుతో నియోజకవర్గంలో దాదాపు తిరిగినా ఆరోగ్యం సహకరించక ఈటల మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ కూడా తనదైన ముద్ర వేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈటలను ఢీకొని సత్తా చాటాలని భావిస్తోంది.
అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది. పార్టీ అభ్యర్థి ప్రకటించే విషయంలో అధినేత పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈటలకు సమ ఉజ్జీ అయిన వారినే నిలబెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఇంతవరకు అభ్యర్థి ప్రకటనపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో టీఆర్ఎస్ పై ప్రజల్లో కూడా అనుమానం కలుగుతోంది.
దళితబంధు పథకమే తమను గెలిపిస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే అభ్యర్థి ప్రకటన విషయంలో కాస్త తాత్సారం చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నియోజకవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ తమ అభ్యర్తిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 166న దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో అభ్యర్థి ప్రకటన కేసీఆర్ చేస్తారని చెబుతున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.