Huzurabad effect: హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం హోరందుకుంటోంది. అక్టోబర్ 30న జరిగే పోలింగ్ లో ఓట్లు సంపాదించాలని పార్టీలు తలమునకలయ్యాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో వెనుకబడిపోతోంది. హుజురాబాద్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని భావించినా అది నెరవేరలేదు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలతో అందరిలో అంచనాలు పెరిగినా ఎందుకు పార్టీ మాత్రం వెనుకబడిపోయింది.

టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నేతకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థి సంఘం నేతకే మొగ్గు చూపినా ఆయన ఎవరికి సుపరిచితుడు కాకపోవడం పార్టీకి నష్టమే. కానీ ప్రచారంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తన ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ద్విముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని తెలుస్తోంది.
హుజురాబాద్ బరిలో మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు వినిపించినా చివరి క్షణంలో సీన్ రివర్స్ అయింది. హుజురాబాద్ విషయంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపినా సురేఖ పెట్టిన షరతుల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో పోటీ చేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి, పరకాల, వరంగల్ సీట్లు తాము సూచించిన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోవడంతోనే సురేఖ విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం.
మొత్తానికి హుజురాబాద్ లో రాజకీయం మాత్రం ఇరు పార్టీల్లోనే జోరుగా సాగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తమ విజయం కోసం తాపత్రయ పడుతున్నాయి. అధికార పార్టీ దళితబంధు పథకం పేరుతో, బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.