
హుజురాబాద్ లో ద్విముఖ పోరే ఉంటుందని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ కూడా దీటైన అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీకి ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖ, సత్యనారాయణ, కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుతందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు అయి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ మాత్రం వెనుకంజలో పడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పార్టీని ముందుకు నడిపిస్తారని భావించారు. కానీ హుజురాబాద్ లో మాత్రం పార్టీ వెనుకనే ఉండి పోయింది.
హుజురాబాద్ లో ఓట్లు రాబట్టుకోవాలంటే అభ్యర్థి బలంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ కు చెందిన బీసీ నేత కొండా సురేఖకు టికెట్ ఇస్తే బీజేపీ, టీఆర్ఎస్ ను ఢీకొనే సత్తా వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ బీసీకే మొగ్గు చూపడంతో బీసీకే మద్దతు పలికితే సురేఖకే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇరు పార్టీలు బీసీకి టికెట్ ఇవ్వడంతో ఎస్సీని బరిలో దింపాలని భావిస్తే డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం వస్తుందని అనుకుంటున్నారు. లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి ఓటు వేస్తే కనుక కృష్ణారెడ్డిని పోటీలో దింపొచ్చని తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రెండు పార్టీలను తలదన్నే అభ్యర్థి కోసమే ఇన్నాళ్లు ఆగుతున్నారనే విషయం తెలుస్తోంది. మరో పక్క ఇక్కడ నుంచి ఇదివరకు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన దాఖలాలు తక్కువగా ఉండడంతో దీనిపై ప్రధాన దృష్టి కేంద్రీకరించడం వృథా అనే అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉందని భావించినా హుజురాబాద్ లో ఎందుకు ఆలస్యం చేస్తుందని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితేనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను బలంగా ఢీకొట్టగలమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అన్వేషణలో పడి పార్టీ అభ్యర్థి కోసం వెతుకున్నట్లు తెలుస్తోంది.