Harish Etela: హుజూరాబాద్(Huzurabad) బరిలో ఒకప్పటి తెలంగాణ కేబినెట్ సహచరులు.. జిగ్రీ దోస్తులు ఇప్పుడు శత్రువులుగా తలపడుతున్న పరిస్థితి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కంటే కూడా ఈటల రాజేందర్ (Etela Rajendar) వర్సెస్ హరీష్ రావు(Harish Rao)గా మారిపోయింది. ఇద్దరు నేతలు తాము అత్యంత సన్నిహిత పాత మిత్రులం అని మరిచిపోయి హద్దులు దాటి విమర్శలు చేస్తుండడం కాక రేపుతోంది.
నిన్నటివరకు హరీష్ రావు విషయంలో చాలా సానుభూతితో వ్యవహరించిన ఈటల రాజేందర్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నీ చరిత్ర అంతా బయటపెడుతా.. జాగ్రత్త’ అంటూ హరీష్ రావుకు హెచ్చరికలు జారీ చేయడం సంచలనమైంది. కారు కూతలు, అబద్దాలను డ్రామా కంపెనీలాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్న హరీష్ రావును ఊరికే వదిలిపెట్టనని ఈటల చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
తనపై ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు ఈటల.. నేనే అన్ని ఏర్పాట్లు చేస్తానని.. నువ్వు ఇంత తోపు, తురుంఖాన్ అయితే బహిరంగ చర్చకు రావాలని ఈటల సవాల్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హరీష్ రావు తాజాగా హుజూరాబాద్ లో ప్రజలతో మాట్లాడి.. ఈటల రాజేందర్ చేయని పనులపై వారితోనే మాట్లాడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘తాను కట్టించిన ఇళ్లను చూపిస్తాను.. నాతోపాటు రావాలని’ సవాల్ చేశారు.
నిన్నటిదాకా పాత మిత్రుడు అని మిన్నకున్న ఈటల రాజేందర్ తాజాగా హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. ఆయన నీచుడు అని.. ఆయన నిర్వాకంపై ప్రజలు ఉమ్మేస్తున్నారని విమర్శించారు. నీకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వను అన్నది నిజం కాదా? సీఎం సీటుకే హరీష్ ఎసరు పెట్టాడని ఆరోపించారు.. సీఎం పదవికి పోటీకి వస్తున్నా.. అని నన్ను తొలగించారా? లేక భూముల కబ్జా చేశానా? చెప్పాలని సవాల్ చేశారు.
నిన్నటిదాకా టీఆర్ఎస్ కు నమ్మిన బంటులా ఉన్న హరీష్ రావును డిఫెన్స్ లో పెట్టేలా ఈటల వ్యాఖ్యానించారు. కేసీఆర్, టీఆర్ఎస్ అనుమానంగా హరీష్ ను చూసేలా వ్యక్తిగత విమర్శలు చేశారు. అనుమానపు బీజాలు నాటారు. మరి ఈటల మరింత ముందుకెళుతారా? హరీష్ పై ఈ వేడి కొనసాగిస్తారా? ఆయనను వ్యక్తిగతంగా కేసీఆర్ కు దూరం చేస్తారా? అన్నది వేచిచూడాలి.