AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే బయోమెట్రిక్ హాజరు లేదనే సాకుతో 10 నుంచి 50 శాతం వరకు తగ్గించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు హాజరు డాటాను పరిగణనలోకి తీసుకోవడంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడమేమిటని అందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల బాధలు పట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బయోమెట్రిక్ మెషీన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో హాజరు శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పండుగ పూట వేతనాల్లో కోత విధించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. మెషీన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
కొన్ని చోట్ల డివైస్ లు అందుబాటులో లేకపోవడంతో కాగితాల్లోనే సంతకాలు చేయాల్సి రావడంతో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని వివరించినా లాభం లేకుండా పోతోంది. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే రెగ్యులర్ వేతనాలు అందుతాయని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ తో సాంకేతిక సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా వేతనాల్లో కోతలు పెట్టడంతో జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని అడుగుతున్నారు.
సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా కోతలు పెట్టడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకుని పూర్తిస్థాయి వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల బాధలు అర్థం చేసుకుని ప్రభుత్వం బయోమెట్రిక్ తప్పిదంగా పరిగణించి వేతనాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.