Huzurabad By Election: తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు హూజూరాబాద్ వైపు చూస్తోంది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ప్రభుత్వాలను మార్చేయకపోయినా ఇద్దరు నేతల మధ్య సవాల్ లో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ లో సుధీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ తిరుగుబాటు చేయడం ఒక ఎత్తయిదే.. టీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో చూపిస్తామమని అధికార పార్టీ మరో ఎత్తులు వేస్తూ రాజకీయ వేడిని పుట్టించారు. వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం ఎవరు సాధిస్తారోనని రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యంగా బాగా ఆసక్తిగా ఉన్న వారు అచ్చంపేట గ్రామస్థులు. మెదక్ జిల్లాలోని అచ్చంపేటకు ఈటల రాజేందర్ కు ఉన్న సంబంధం ఏంటో ఇదివరకే అర్థమైంది. దీంతో ఈటల గెలిచి నిజాయితీ పరుడు అనిపించుకుంటాడా..? లేక అతడు భూ కబ్జాలు నిజమేనని అతడిని ఓడిస్తారా..? అని ఇక్కడి గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.
మెదక్ జిల్లాలోని అచ్చంపేట గ్రామంలో భూ కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ ముఖ్యపాత్ర వహించాడని అక్కడి కొందరు గ్రామస్థులు ఆరోపించారు. తమ భూములను బలవంతంగా లాక్కున్నాడని కొందరు మీడియా ఎదుట వచ్చి వాపోయారు. అయితే లోతుగా పరిశీలిస్తే మాత్రం పొద్దున అలా చెప్పిన వాళ్లు సాయంత్రం మాట మార్చారని తెలిసిందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఏదీ ఏమైనా ఈ భూకుంభకోణం విషయంలో గ్రామస్థులు చేసిన ఆరోపణలతోనే ఈరోజు హుజూరాబాద్ లో ఇంతటీ రాజకీయ వేడి పుట్టడానికి కారణమైందని అంటున్నారు.
టీఆర్ఎస్ కేబినేట్లో ముఖ్యమైన మంత్రుల్లో హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఉంటూ వస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా బీసీలను అణగదొక్కుతున్నారనే ఆవేదన ఈటల రాజేందర్ లో ఉంది. కానీ అధికార ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల ఏం చేయలేకపోయారు. ఇక సమయం వచ్చినప్పుడు బయటపడుదామనుకున్నారు. అప్పటికే పార్టీకి సంబంధం లేకుండా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న రాజేందర్ పై నిఘా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాగానే రాజేందర్ పై చర్యలు తీసుకునేందుకు సరైన సమయం అనుకున్నారు. అయితే ఈ రాజేందర్ పై చర్యలతో ఆయన కాళ్ల బేరానికి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన తిరగబడ్డారు.. పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అప్పటికే రాష్ట్రంలో పట్టుకోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఈటల రాజీనామాతో మంచి అవకాశం లభించినట్లయ్యింది. దీంతో ఆయనను పార్టీలో చేర్పించుకొని ఆయనకే టికెట్ అనౌన్స్ చేశారు. ఇక ఈటల రాజేందర్ బీసీ కనుక త్వరలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలున్నాయన్న ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీలే అధికంగా ఉన్నారు. కానీ వారికి ముఖ్యమంత్రి స్థాయి ఎప్పుడూ రాలేదు. దీంతో ఈటల రాజేందర్ తనను ఆదరిస్తే బీసీ ముఖ్యమంత్రికి దారులు పడ్డట్లేనని ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ తెలంగాణ పార్టీలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ పలువురు బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. దీంతో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద వ్యూహమే రచిస్తున్నారు.
ఇదిలా ఉండగా తనకు ఎదరు వచ్చిన వారిని ఓడించడానికి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు.అందుకే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావుకు హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీశ్ రావు తాను ప్రచారం చేయడంతో పాటు కరీంనగర్ జిల్లాలోని మంత్రులతో ప్రచారం చేయిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ దళిత బంధు, ఇతర పథకాలతో బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా అవి ఎలా ఫలితాలిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.