Pattabhi Arrest: ఏపీ సీఎం జగన్ పై బండబూతులతో విరుచుకుపడ్డ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాడు. గతంలో ఇలానే నోరుజారిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అధికార వైసీపీ అరెస్టులతో ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో ఇంతటి గొడవలకు కారణమైన పట్టాభిని కూడా వదలడం లేదు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ చేస్తారనే వార్తలు రావడంతో పట్టాభి బయటకు రాకుండా తన ఇంట్లోనే ఉండిపోయారు. ఒకవైపు పోలీసులు, మరో వైపు మీడియా, పార్టీ శ్రేణులు ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాత్రి 9 గంటల వేళ ఇంటికి లాక్ ఉండడంతో వెనుకాల వంటిగది తలుపులు పగులగొట్టి 30 మందికి పైగా పోలీసులు లోపలికి వెళ్లి పట్టాభిని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ నేతలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నా.. వారిని పక్కకు నెట్టి పట్టాభిని వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మీడియాను కవర్ చేయకుండా దూరంగా జరిపారు.
తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్ట్ కు ముందు తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవంటూ ఒక సంచలన వీడియో విడుదల చేశారు. వీడియో తేదీ, సమయం కూడా చూపించిన పట్టాభి తనకు వైసీపీ సర్కార్ నుంచి ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించిన పట్టాభి.. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన చెందారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పట్టాభి పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అన్నారు.
పట్టాభి వీడియో