Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బాధ అంతా ఇంత కాదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు అన్నది ఆ పార్టీ వాదన. దానిపైనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసింది. కోటి సంతకాలు సేకరించినట్లు చెబుతోంది. ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే.. ప్రతి ఐదుగురిలో ఒకరి నుంచి సంతకాలు సేకరించిందన్నమాట. ఆ విషయాన్ని పక్కన పెడితే పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ అంటే ప్రైవేటీకరణ కాదని పదేపదే చెబుతున్నారు చంద్రబాబు. గతంలో చాలా రకాల ప్రభుత్వ వ్యవస్థలు, పథకాలు అదేవిధంగా అమలు చేస్తున్నారని ఉదాహరణలతో సహా చంద్రబాబు చెప్పారు. కానీ వైసీపీ నేతలకు తలకు ఎక్కడం లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. ప్రజల నుంచి స్పందన వస్తుందని భావించి దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం వల్ల మీరు సాధించింది ఏంటి అని అడిగితే మాత్రం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.
* ఆరోగ్యశ్రీ ఆ విధానంలోనే..
వైసిపి ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్( public private partnership) విధానంతో చాలా వ్యవస్థలు నడిచాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా భావిస్తున్న 108 సైతం ఆ విధానంతో నడుస్తున్నదే. ఆరోగ్యశ్రీ విధానం సైతం ఆ విధానంలోనిదే. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేస్తే ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సొమ్ము ఇస్తున్నట్టే.. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి. పేద విద్యార్థుల విద్యకు సంబంధించి ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై స్పష్టంగా చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అది ప్రైవేటీకరణ కాదు.. ప్రైవేట్ సంస్థల నిర్వహణలో ప్రభుత్వం నడిపించే మెడికల్ కాలేజీలు అంటూ చెబుతున్న తలకు ఎక్కించుకోవడం లేదు. 2020లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల పై జీవో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో ప్రకారమే ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఫీజులు ఉంటాయని చెబుతున్న ఇంకా అనవసర ఆందోళన ఏమిటో తెలియడం లేదు.
* వాటికి సమాధానం లేదు..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు( government medical colleges) సంబంధించి హడావిడి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తమ హయాంలోనే వాటిని నిర్మించి ఉంటే.. అడ్మిషన్లు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? 17 ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేసి ఎందుకు వైసిపి హయాంలో అడ్మిషన్లు ప్రారంభించనట్లు? విశాఖ రుషికొండ భవనాల నిర్మాణాన్ని అతి వేగంగా చేపట్టారు కదా? ఈ నిర్మాణాలు జరిపి ఉంటే బాగుండేది కదా? కనీసం తాత్కాలిక భవనాల్లోనైనా అడ్మిషన్లు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? అంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదు. ఏదో ఒక అంశంపై పోరాటం చేయాలి. ప్రైవేటీకరణ అనే అంశంపై పోరాటం చేస్తే ప్రజల నుంచి స్పందన వస్తుందన్నది వైసిపి ఆశ. కానీ ఏపీ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆ విషయం తెలిసినా జగన్ వెనక్కి తగ్గరు. ఆయన అనుకున్నది చేస్తారు కాబట్టి. అంతకుమించి ఏమీ ఉండదు కూడా.