హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలకు సంకేతాలు వచ్చినట్లు సమాచారం. కరోనా ఉధృతి నేపథ్యంలో సెప్టెంబర్ లోగా 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లున్నారు. వీరికి వ్యాక్సినేషన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
గత ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచారు. అయితే ఆయన పదవికి రాజీనామా చేయడంతో స్పీకర్ ఆమోదించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల సందడి నెలకొంది. టీఆర్ఎస్, ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. మంత్రులు గంగుల కమలాకర్ తోపాటు టీఆర్ఎస్ నేతలందరు కార్యకర్తలతో ప్రచారం షురూ చేశారు. గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. విజయం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.
బీజేపీ కూడా దీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈటల రాజేందర్ తో తన ఖాతా మళ్లీ తెరవాలని భావిస్తోంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రమే అని తెలిసిపోతోంది. టీడీపీ, వామపక్షాలు కలిసినా ఒరిగేదేమీ ఉండదు.