ఏపీ బడ్జెట్ లో ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ రూపకల్పనలో సృజనాత్మకత ఉండేలా చూసుకుంటున్నారు. వివిధ పథకాలపేరుతో బడ్జెట్ ఉండేలా జాగ్రత్తలు చేపడుతున్నారు. పిల్లల కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేలా నిర్ణయం తీసుకుంటున్నారు. వ్యవసాయం, మహిళలు, పిల్లలు తదితర వారందరికీ ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే లెక్కల్లో మాత్రం చూపడం లేదు. అమ్మ ఒడి పథకం కింద నగదు బదిలీ చేసే నిధులను అన్ని వర్గాల కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తారు. పిల్లల బడ్జెట్ కూడా అన్ని బడ్జెట్లలో చూపిస్తారు.
అన్ని పథకాల్లో ఇలాగే..
రాష్ర్టంలో చేపట్టే అన్ని పథకాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఉంటాయి. వాటికి నిధులు మాత్రం కేటాయించరు. బడ్జెట్లో మాత్రం నిధులు విడుదల చేసినట్లు చూపుతారు. మహిళలకు, పిల్లలకు, వివిధ సంఘాలకు ఏ మేరకు కేటాయింపులు చేశారో స్పష్టమైన ఆదేశాలు ఉండవు. కేవలం బడ్జెట్లో చూపించి తమ పబ్బం గడుపుకుంటారు. పిల్లలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు కాని వారి అభివృద్ధికి ఏ మేరకు చర్యలు చేపడుతున్నారో చెప్పడం లేదు.
అన్ని అబద్ధాలే..
బడ్జెట్ రూపకల్పనలో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి. ఫలానా వారికి ఇంత కేటాయింపులు చేశామని చెబుతున్నా వాస్తవంగా కేటాయంపులు మాత్రం ఉండవు. దీంతో వారు బడ్జెట్ కేటాయించారనే భ్రమలోనే బతకాల్సి వస్తుంది. ఇప్పటికే బడ్జెట్ సుమారు మూడు లక్షల కోట్లకు చేరడంతో కేటాయింపులు ఏ విధంగా ఉంటాయోనని అందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది భారీ లోటున్నా మూడు నెలల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకున్న సర్కారు బడ్జెట్ తయారుపై ఏ మేరకు విజయం సాధిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఏ వర్గాలకు ప్రయోజనం
బడ్జెట్ రూపకల్పనలో ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. గత ప్రభుత్వం వ్యవసానికి పెద్దపీట వేయగా జగన్ సర్కారు దేనికి ప్రాముఖ్యత ఇస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు. జగన్ ఎక్కువగా మహిళలనే నమ్ముకుంటున్నారు. వారి సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ఎవరి అంచనాల్లో వారు ఉండిపోయారు.