Ayodya Ramamandir: హిందువులు అందరూ పరమ పవిత్రంగా భావిస్తున్న అయోధ్య రామాలయం నిర్మాణం ఎంతవరకూ వచ్చిందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు 40శాతం పూర్తయినట్లు రామజన్మభూమి మంది తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక అంతే కాకుండా ఈ ఆలయ నిర్మాణ ఫొటోలను విడుదల చేసింది. అవిప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్న అయోధ్య రామమందిరం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఆలయంలో గర్భగుడి సంబంధించిన పనులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల శంకుస్థాపన చేశారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయోధ్య హనుమాన్ గడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2023 డిసెంబర్ కల్లా ఈ పనులు పూర్తవుతాయని కమిటీ అంచనా వేస్తోంది.
అయోధ్య నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ముందుగానే సిద్ధం చేసిన ప్రణాళికల మేరకు పనులు ముందుకు సాగుతున్నాయి.
2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్థులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడగుల పొడువు ఉన్న 17వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని నిర్మాణ కమిటీ చెబుతోంది. అయితే కేంద్రంలోని బీజేపీ మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే రామాలయం నిర్మాణం పూర్తి అవుతుందని.. తద్వారా ఎన్నికల్లో ప్రజల మద్దతు, సెంటిమెంట్ పొందవచ్చని భావిస్తోంది.