Messi Kolkata Tour: అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సి ఇటీవల తన గోట్ టూర్ భాగంగా ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలో కోల్ కతా లో ముందుగా పర్యటించాడు. అక్కడి సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల 22 నిమిషాల్లోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు.. హైదరాబాదులో అతని టూర్ సజావుగానే సాగింది. ముఖ్యమంత్రి స్వయంగా ఫుట్బాల్ ఆడాడు. దీంతో సందడి వాతావరణం ఏర్పడింది. ముంబైలో కూడా నిర్వహించిన గోట్ టూర్లో సచిన్ నుంచి మొదలుపెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు అందరూ హాజరయ్యారు.
కోల్ కతా టూర్ లో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల పెను దుమారం ఏర్పడింది. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన క్రీడా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అంతేకాదు శతద్రు అనే వ్యక్తిని కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడితోనే ఈ వివాదం ఆగిపోవడం లేదు. ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన దర్యాప్తు సంస్థ చెబుతోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.
మెస్సీ టూర్ లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు, సిట్ దర్యాప్తు జరుపుతున్న తీరు ప్రకారం దాదాపు 100 కోట్ల కుంభకోణం జరిగి ఉంటుందని సమాచారం. మెస్సీ తో ఫోటోలు దిగడం, టికెట్ల విక్రయాలలో అవకతవకలు చోటు చేసుకన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు కూడా జరిపారు. అతని ఖాతాలో ఉన్న 22 కోట్లను సీజ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ దీనిని లోతుగా విచారిస్తోంది. కోల్ కతా లోని శతద్రు ఇంటికి వెళ్లి చూసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతడి సామ్రాజ్యాన్ని చూసి నోరు వెళ్ళబెట్టింది.
దాదాపు మూడు అంతస్తులలో అతడు భవనాన్ని నిర్మించుకున్నాడు.. తన ఇంటిపై ఏకంగా అతడు ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మించుకున్నాడు. అతి పెద్ద ఈతకొలను.. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కార్యాలయం.. అతడు నివసిస్తున్న ఇంట్లో ఉన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు..
మెస్సి టూర్ ద్వారా శతద్రు బృందం భారీగా సంపాదించిందని.. 100 కోట్ల వరకు వెనకేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెస్సి తో ఫోటో దిగడానికి పది నుంచి 30 లక్షల వరకు నిర్వాహకులు వసూలు చేశారు. మీ చెల్లింపులకు సంబంధించి అధికారికంగా ఎటువంటి లెక్కలు చూపించలేదు. టికెట్ల విక్రయాలలోను భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే శతద్రు ఖాతాలో ఉన్న 22 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఇంకా లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెస్సి పర్యటించిన నేపథ్యంలో.. ఇక్కడ కూడా అక్రమాలు జరిగి ఉంటాయని ప్రతిపక్ష గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తోంది. అడ్డగోలుగా మాట్లాడటం గులాబీ పార్టీకి అలవాటైపోయిందని మండిపడుతోంది.