Delhi Election Result : 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వంటి పథకాలు ప్రజల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి. పదేళ్ల తర్వాత కూడా ఈ పథకాల భవిష్యత్తుపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పథకాలు కొనసాగుతాయా లేదా అన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉచిత విద్యుత్, నీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్, తీర్థయాత్ర పథకం వంటి పథకాలు అమలులో ఉన్నాయి. ఈ పథకాల వల్ల సాధారణ కుటుంబాలకు నెలకు ఎంత ఆదా అవుతుందో చూద్దాం.
ఉచిత విద్యుత్ పథకం గురించి మాట్లాడితే.. ఢిల్లీలో ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 201-400 యూనిట్ల మధ్య వినియోగం ఉన్న వారికి 50% సబ్సిడీ వర్తించనుంది. 200 యూనిట్ల విద్యుత్ ఖర్చు సుమారు రూ.600 అవుతుంది. మీటర్ ఫిక్స్‌డ్ ఛార్జ్ రూ.20గా ఉంది. ఇతర ఛార్జీలు కలిపి సుమారు రూ.800 అవుతాయి. 400 యూనిట్ల విద్యుత్ ఖర్చు రూ.1,800 అవుతుంది. మొత్తంగా నెలకు కరెంట్ బిల్లు రూ.2,100 వస్తుంది. సబ్సిడీ అనంతరం ఖర్చు రూ.1,100-రూ.1,200. ఈ విధంగా ఒక సాధారణ కుటుంబానికి నెలకు సుమారు రూ.1,000 ఆదా అవుతోంది.
ఉచిత నీటి పథకం ద్వారా .. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 20,000 లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా కల్పిస్తోంది. సాధారణంగా, ఒక కుటుంబం రోజుకు 500-600 లీటర్ల నీటిని వినియోగిస్తుంది, అందువల్ల ఎక్కువ మంది 20,000 లీటర్ల ఉచిత సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతున్నారు. 20,000 లీటర్ల వరకు నీటి ధర చూస్తే 1,000 లీటర్లకు రూ.5.27 అవుతుంది. మీటర్ ఛార్జ్ రూ. 146.41, సివేజ్ మెంటినెన్స్ ఛార్జ్ మొత్తం బిల్లుపై 60శాతం ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే సుమారు రూ.350 అవుతుంది. అయితే 20,000 లీటర్ల మించితే నీటి ఛార్జీలు పెరుగుతాయి.
30,000 లీటర్ల వరకు బిల్లు సుమారు రూ.990 వస్తుంది. ఈ లెక్కన ఉచిత పథకం వల్ల సుమారు రూ.500 నెలకు ఆదా అవుతుంది.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: 2019-20 నుంచి ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. సాధారణంగా, ఒక రోజు ప్రయాణ ఖర్చు రూ.50. ఒక మహిళ 25 రోజులు ప్రయాణిస్తే రూ.1,250 ఆదా అవుతుంది.ఈ లెక్కన చూసుకుంటే .. ఈ మూడు పథకాలతో ఒక కుటుంబానికి నెలకు రూ.2,500 వరకు ఆదా అవుతుంది.
ఇతర ఉచిత పథకాలు:
ఉచిత విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, పుస్తకాలు, యూనిఫాం
ఉచిత ఆరోగ్య సేవలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు
తీర్థయాత్ర పథకం: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర
పెన్షన్ పథకాలు: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు రూ.2,100 భృతి అందించనున్నట్లు హామీ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ మాత్రం రూ.2,500 వరకు ఇస్తామని ప్రకటించాయి.
కేజ్రీవాల్ ఉచిత పథకాలు ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవనాన్ని కొనసాగించేందుకు అవకాశం కల్పించాయి. అయితే, ప్రభుత్వం మారితే ఈ పథకాల్లో మార్పులు ఉంటాయా లేదా కొనసాగుతాయా అన్న అంశంపై ప్రజల్లో ఆసక్తి కొనసాగుతుంది.