
పార్టీలు స్థాపించడమే కాదు.. ఆ పార్టీకి ప్రజల్లో నమ్మకం ఏర్పడాలి. నిత్యం ప్రజల కోసం పోరాడాలి. ప్రభుత్వాలను నిలదీయాలి. హక్కులపై ప్రశ్నించాలి. ముఖ్యంగా గెలుపోటములను పక్కన పెట్టి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. వీటన్నింటినీ సాధ్యం చేస్తేనే ఆటోమెటిక్‌గా అధికారం దరి చేరుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇదే కీలకం. అన్నేళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు కూడా ఇటీవల పార్టీ పటిష్టత కోసం మార్పులకు దిగారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు.
Also Read: జగన్ సర్కార్ కు టాలీవుడ్ షాక్..హైకోర్టుకు కృష్ణంరాజు, అశ్వినీదత్
ఇక ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిన ఆయన.. పార్టీని పక్కనబెట్టినట్లేనా..? గతేడాది ఎన్నికల్లో పోటీచేసిన జనసేన.. కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పైగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీచేస్తే ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయారు. ఈ పరిణామాలతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికలు గడిచిపోయి ఏడాదిన్నర అయింది. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే అధికార పార్టీ వైపు మొగ్గారు. ఈ క్రమంలో ప్రజల్లో ఎక్కడా జనసేన అనే మాటే వినిపించడం లేదు. ఆ పార్టీ జెండా కూడా కనిపించడం లేదు. ఓడిపోయామని ప్రజల్లో లేకుండా ఎవరు కూడా ఏపార్టీని గుర్తుపెట్టుకోరు కదా.
అధికారంలోకి వస్తాం.. భావి తరాలకు మంచి భవిష్యత్ ఇస్తామంటూ పదే పదే చెప్పుకొచ్చిన పవన్.. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోనీ.. ఎన్నికలు ముగిశాక అయినా ప్రజల్లో ఉన్నారా అంటే అదీ లేదు. ఎన్నికల టైంలో పార్టీ వెంట ఉన్న చాలా మంది నేతలు ఇప్పటికే జారుకున్నారు. చాలావరకు జిల్లాల్లో పార్టీని నడిపించే సారథులు లేకుండాపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఇటీవల ఎందుకో సొంతంగా పుంజుకునేందుకు దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్, హరీష్ ల సీక్రెట్ చెప్పి దుమారం రేపిన డీ.శ్రీనివాస్
గతంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఆ తర్వాత కనీసం ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందనో కూడా చూడలేదు. మరి ఇలాంటి వైఖరితో ఉన్న నాయకుడిని ప్రజలు ఏమాత్రం చేరదీస్తారు. ఈ ఏడాదిన్నరలో జనసేన పొలిటికల్ గ్రాఫ్ భారీగా పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్ మున్ముందు కూడా ఇలానే ఉంటే.. భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పాలి.