AP Government: పీఆర్సీ విషయమై ఏపీ సర్కారు, ఉద్యోగుల మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వం చర్చలతో సమ్మె నుంచి వెనక్కు తగ్గారు ఉద్యోగులు. చర్చలు సఫలమై ఉద్యోగులకు ఇచ్చే ఫిట్ మెంట్, ఇతర అంశాలపైన ఏపీ సర్కారు ప్రకటన చేసింది. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకముందే ఏపీ సర్కారు అప్రమత్తమై చర్చలకు చొరవ తీసుకుంది. కాగా, ఏపీ సర్కారు ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది.

దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాలకు సమానంగా ఉద్యోగుల వేతనాల కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తుండటం గమనార్హం. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ సర్కారు రూ. 37,458 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ప్రభుత్వ మొత్తం ఖర్చులో వేతనాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇచ్చిన నివేదికలోనూ తేలింది.
Also Read: అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
ఏపీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వాటా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21 శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వాటా 36 శాతంగా ఉంది. ఇకపోతే పీఆర్సీని అమలు చేస్తే రూ.10 వేల కోట్లకు పైగా భారం ఏపీ సర్కారుపైన పడనుంది. ఇప్పటికే వేతనాలు, పెన్షన్ల రూపంలో రూ.68,340 కోట్లను ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తోంది. అలా బడ్జట్ లెక్క ప్రకారం నిరర్థక ఖర్చు కింద ఈ లెక్కలను చూపిస్తారు. ఏ మాత్రం తిరిగి రాని ఖర్చుల కింద రూ.68 వేల కోట్లను ఉద్యోగులకు ఏపీ సర్కారు ఖర్చు చేస్తోంది.

మొత్తంగా పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంది. సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన నేపథ్యంలో ఆ మేరకు చర్చలు, అవి సఫలమవడం, తర్వాత నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. ఇకపోతే కొత్తగా పీఆర్సీ అమలు చేస్తే మరో రూ.10వేల కోట్ల ఖర్చు రానుంది. అలా మొత్తం అన్నీ ఖర్చులు కలుపుకుంటే ఏపీ సర్కారుపైన రూ.78 వేల కోట్ల భారం పడనుందని తెలుస్తోంది. ఆ లెక్కన రాబోయే రోజుల్లో ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకుగాను ఏపీ ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు అంచనా వేస్తున్నారు. దేశంలో నాగలాండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఉద్యోగుల వేతనాల కోసం ఖర్చు ఎక్కువగా ఉందని ఓ సర్వేలో తేలింది. కాగా, ఆ జాబితాలో ఇప్పుడు ఏపీ కూడా చేరనుంది.