Economic Recession 2023: గూగుల్ 18 వేల మందికి ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తొలగించింది.. కేవలం ఈ ఏడాది జనవరి 15 వరకు అక్షరాల 24 వేల మంది ఉద్యోగులను ఐటి కంపెనీలు తొలగించాయి. ఈ కోతలు టెకీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. భవిష్యత్తుపై భయం రేకెత్తిస్తున్నాయి. ఎందుకు ఈ కోతలు? వీటి ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థ పై ఎంతవరకు ఉండబోతోంది?

ఆమెరికా తర్వాత..
ఆమెరికా తర్వాత భారత్ లోనూ ఈ తీసివేతల ప్రభావం కనిపిస్తోంది.. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో.. 800 మంది ప్రెషర్స్ ను ఇంటికి పంపించినట్లు సమాచారం.. శిక్షణ తర్వాత జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన ఫ్రెషర్స్ ను మాత్రమే ఇలా ఇంటికి పంపిస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.. ఫ్రెషర్స్ మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి ఆలస్యంగా తమను ట్రైనింగ్ కు పిలిచి విప్రో పరీక్ష పేరుతో తమ ఉద్యోగాలతో ఆట ఆడుకుందని విమర్శిస్తున్నారు.. అయితే మిగతా కంపెనీలు ఏం చేస్తాయనే దానిపైన ఒక స్పష్టత లేదు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంతవరకు పొదుపు చర్యల గురించి ప్రస్తావించడం లేదు. ఆ సంస్థ కీలక ఉద్యోగి చంద్రశేఖర్ మాత్రం క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆచితూచి జరుపుతామని స్పష్టం చేశారు..
అంతకు మించి..
2008లో వచ్చిన మహా మాంద్యం సమయంలో టెక్ కంపెనీలు దాదాపు 65 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.. మరుసటి సంవత్సరంలోనూ దాదాపు అంతే సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.. కానీ ప్రస్తుతం అంతకుమించి అనేలాగా కోతలు ఉన్నాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 టెక్ కంపెనీలు 1,54,336 ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు సంవత్సరాలలో 1495 కంపెనీలు 2.4 లక్షల ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచంలో ఉన్న వ్యక్తిగత సంస్థలో అయినా మనవాళ్ళ సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తొలగింపుల సెగ భారతీయులకు భారీగా తగులుతున్నది. అమెజాన్ సంస్థ అంతర్జాతీయంగా తలపెట్టిన 18 వేల ఉద్యోగాల కోతలో భాగంగా భారతదేశంలో 1000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. గోల్డ్ మాన్ శాష్ కూడా తన భారతీయ కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.. ఆ సంస్థకు మనదేశంలో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు.. వారిలో కనీసం 500 మందిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇలా చాలా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.

మన దేశంలో 24 వేల మంది పై వేటు
ఇక మనదేశంలో కోతల విషయానికి వస్తే జనవరి 1 నుంచి 15 మధ్య 91 టెక్ కంపెనీలు దాదాపు 24 వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి.. 20వ తేదీ నాటికి ఈ సంఖ్య 26 వేలకు చేరినట్లు సమాచారం.. దేశీయ సామాజిక మాధ్యమం షేర్ చాట్ తన ఉద్యోగుల్లో 500 మందిని తొలగించింది.. ఓలా కంపెనీ 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. మోజో సంస్థ తన సిబ్బందిలో మూడు శాతం మందిని ఇంటికి పంపింది. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గి 38 మంది ఉద్యోగులపై వేటు వేసింది.. ఆర్థిక పరిస్థితులు ఆశించిన విధంగా లేకపోవడంతో కష్టంగానే ఈ బాధాకర నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది.. తీసివేసే ఉద్యోగులకు స్విగ్గిలో వారి ఉద్యోగ కాలాన్ని బట్టి మూడు నుంచి 6 నెలల పాటు సంస్థ వేతనం చెల్లించనుంది.