LK Advani : లాల్ కృష్ణ అద్వానీ: ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయిన బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ తదుపరి విచారణ చేయించుకోవాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ ప్రైవేట్ వార్డు నుంచి తన అధికారిక నివాసానికి గురువారం (జూన్ 27) వెళ్లారు. ఫాలోఆప్ కోసం తర్వాత రావాలని వైద్యులు ఆయనకు సూచించారు.
బుధవారం (జూన్ 26) రోజున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 96 ఏళ్ల వయస్సున్న అద్వానీకి వృద్ధాప్యానికి సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యల కారణంగా యూరాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ నేతృత్వంలో బృందం ఆయనకు చికిత్స చేసింది. ఎయిమ్స్ నుంచి అందిన సమాచారం మేరకు రాత్రి 10.28 గంటలకు పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. యూరాలజీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆయన కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.
2014 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎల్‌కే అద్వానీ. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయన ఇంటికి వెళ్లి, ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఇటీవలే ఫొటోలు సైతం విడుదలయ్యాయి.
పాకిస్థాన్‌లోని కరాచీలో 1927, నవంబర్ 8న హిందూ సింధీ కుటుంబంలో జన్మించారు ఎల్ కే అద్వానీ. 1998-2004 మధ్య బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లో హోం మంత్రిగా పనిచేశాడు. 2002-2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దేశానికి ఏడో ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు. 10వ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించారు. ఈ ఏడాది (2024) భారత ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసి గౌరవించింది.