Divorce : అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శుభలగ్నం అనే సినిమా వచ్చింది.. మీకు గుర్తుందా? అందులో డబ్బు కోసం.. కట్టుకున్న భర్తకు ఆమని విడాకులు ఇస్తుంది.. అప్పట్లో అదొక సంచలనం.. పేరుకు సినిమానే గాని.. చాలామందిని అది ప్రభావితం చేసింది. మరి ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకుందో.. లేక మరేంటో తెలియదు గాని.. ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది.. నేటి ఆధునిక కాలంలో విడాకులు కామనే కదా అని మీరు లైట్ తీసుకోవచ్చు.. కానీ ఈ స్టోరీ చదవండి.. బాబోయ్ ఇంత చిన్న కారణానికి కూడా విడాకులు ఇస్తారా? అని నోరెళ్ళబెట్టడం మీ వంతవుతుంది..
ఆమె పేరు ఏంటో తెలియదు.. వయసు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల దాకా ఉండొచ్చు.. ఆమె తన రెడ్డిట్(ఒకరకంగా ఫేస్ బుక్ లాంటిది) ఖాతాలో తన భర్త వల్ల పడుతున్న ఇబ్బందులను ఏ కరువు పెట్టింది..” నేను ఎంతో ఇష్టపడి ఆవకాయ పచ్చడి పెట్టాను. పెట్టిన పచ్చడిని జాడీల్లో పెట్టి భద్రపరిచాను. ఆ జాడీలో నుంచి కొంత ఆవకాయ పచ్చడి తీసుకుని.. అన్నంలో కలుపుకొని తింటాను.. నా భర్త కూడా అలాగే తింటాడు.. కానీ జాడీలో నుంచి ఆవకాయ పచ్చడి తీసుకున్న తర్వాత.. వాటి మూతలను గట్టిగా పెడుతుంటాడు. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతోంది. ఆ మూతలు తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇదే విషయమై నా భర్తతో చాలాసార్లు వాగ్వాదం జరిగింది. ఆ మూతలు తీసేందుకు పొరుగింటి వారి సహాయం కోరాల్సి వస్తోంది. అలా మూతలు ఎందుకు పెడుతున్నావని నేను అడిగితే.. లోపల ఉన్న పచ్చడి తాజాగా ఉంటుందని అతడు చెప్పేవాడు. పచ్చడి ఎలా ఉన్నా నాకు ఇబ్బంది లేదని, నేను చాలాసార్లు చెప్పాను. అయినా అతడు వినిపించుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి ఇలానే మా ఇంట్లో వ్యవహారం కొనసాగుతోంది.. ఉద్దేశపూర్వకంగానే నా భర్త ఇలా జాడీ మూతలు పెడుతున్నట్టు నేను గమనించాను.. నేను నిలదీసే సరికి అతడు క్షమాపణ చెప్పాడు. కానీ అప్పటికే నాలో ఓపిక నశించిందని” ఆ మహిళ వాపోయింది.
భర్త వ్యవహార శైలి భరించలేక ఆమె అప్పటికే విడాకులకు దరఖాస్తు చేసింది.. అయితే ఆ దరఖాస్తులో జాడీల మూతలు బిగుతుగా పెట్టడమే కారణమని ఆ మహిళ పేర్కొంది.. అయితే ఆ భర్త కావాలనే ఇదంతా చేస్తున్నప్పటికీ.. ఆ విషయాన్ని ఆమె ముందు అంగీకరించలేదు. దీంతో ఆమె కోపం తారాస్థాయికి చేరింది.. ప్రతిరోజు జాడీల మూతలు తెచ్చేందుకు తాను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. ఇక తట్టుకోలేక ఆమె అతనికి విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది.. అయితే ఆ మహిళ రెడ్డిట్ లో తన బాధను ఏకరువు పెట్టిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆమె బాధను మొత్తం చదివిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలకే విడిపోతే సంసారాలు నిలబడవని.. చాలామంది కామెంట్స్ చేశారు.