Akunuri Murali: వర్షం ఎండిపోతున్న చేను మీద కురవాలి. అదే సముద్రం మీద కురిస్తే పెద్ద ఉపయోగం ఉండదు. అలాగే ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.. అంతేకానీ ఆర్థికంగా స్థితివంతమైన కుటుంబాల కు ప్రయోజనం చేకూర్చకూడదు.. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల పేదల మాటున పెద్దలు బాగుపడుతున్నారు.. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే… తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు అనే ఒక పథకం అమలవుతోంది. రైతుల కోసం ప్రభుత్వమే రెండు దఫాలుగా ఎకరానికి 5000 చొప్పున ఏడాదికి పదివేల దాకా పెట్టుబడి సహాయం అందజేస్తుంది. దీన్ని ఒక రెవల్యూషనరీ స్కీమ్ గా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించుకున్నారు. ఇదే దారిలో కేంద్రం కూడా నడుస్తోంది. దానిని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అయితే వాస్తవానికి తెలంగాణలో మెజారిటీ రైతులు సన్న కారు వర్గానికి చెందినవారే. ప్రభుత్వ లెక్కల ప్రకారం సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్నవారు. వారికి పంట పెట్టుబడి సాయం అందుతోంది.. ఇది హర్షించే పరిణామమే.. కానీ ఇదే పంట పెట్టుబడి సాయం భూస్వాములకు కూడా అందుతోంది.

సినీ హీరో నాగార్జునకు రైతుబంధు
రైతుబంధు పథకంపై, అందులో ఉన్న లోపాల గురించి ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ పథకంలోని లోపాల గురించి కుండబద్దలు కొట్టారు. భూస్వాములకు రైతుబంధు ఇస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.. టాలీవుడ్ హీరో నాగార్జునకి కూడా రైతుబంధు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.. అయితే ఆయనకి ఎంత భూమి ఉంది? ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తోంది అనేది మాత్రం చెప్పలేదు. ఇదే సమయంలో అమెరికాలో స్థిరపడిన ఓ వ్యక్తికి కూడా రైతుబంధు వస్తుందని, ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తర్వాత ఇవ్వలేదు
రైతుబంధు పథకం ప్రారంభం ఆయన మొదటి దఫాలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి నగదును తిరిగి ఇచ్చేశారు.. అప్పట్లో దానిని తమ ఘనతగా చెప్పుకున్నారు. తర్వాత ఇవ్వడం మానేశారు. ఈ లెక్కన ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకునేందుకే ఇష్టపడుతున్నారు తప్ప, తిరిగి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు ఒప్పడం లేదు.

లిమిట్ ఎందుకు పెట్టదు
వాస్తవానికి రైతుబంధు అనేది మంచి పథకమే. కానీ ప్రభుత్వ నిష్క్రియా పరత్వం వల్ల ఇది భూస్వాములకు కూడా అందుతోంది. ఇదిగో ఇక్కడ ఈ పథకం దారి తప్పుతోంది. ఈ పథకానికి ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ప్రయోజనం లక్షత వర్గాలకు చేరుతుందా లేదా అనేది చూడటం లేదు. దీనివల్ల సర్కారు సొమ్ము పక్కదారి పడుతుంది. అప్పట్లో బిగ్ బాస్ ఫైనల్లో నాగార్జునకు రాష్ట్ర ప్రభుత్వం అడవిని అభివృద్ధి చేయాలని రాసి ఇచ్చింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు మాదాపూర్ లో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోసం చెరువును ఆక్రమించారని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా రైతుబంధు ఇస్తోంది. ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు దానిని పక్కన పడేసింది. అచ్చం టిఆర్ఎస్ పార్టీ లాగా.