Homeజాతీయ వార్తలుKCR vs Modi: మోదీ ఎలా శత్రువయ్యాడు.. కేసీఆర్‌ భయం అదేనా?

KCR vs Modi: మోదీ ఎలా శత్రువయ్యాడు.. కేసీఆర్‌ భయం అదేనా?

KCR vs Modi: ‘తెలంగాణకు మోదీ ప్రధాన శత్రువు. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కుతింటయ్‌.. అప్రమత్తంగా లేకుంటే కైలాసం ఆటలతో పెద్దపాము మింగిన కథ అయితది సుమా’ ఇదీ వికారాబాద్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు. అయితే రాజకీయంగా కేసీఆర్‌.. దేశ ప్రధాని నరేంద్రమోదీనే తెలంగాణకు శత్రువుగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో కేసీఆర్‌కు ఎలా మిత్రుడుగా ఉండేవాడు.. ఇప్పుడు ఎందుకు శత్రువు అయ్యాడన్న చర్చ జరుగుతోంది.

KCR vs Modi
KCR vs Modi

పార్టీని మింగేస్తుందనే..
భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కావాలని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. ఆ దిశగా ఆశ్వమేధయాగమే చేస్తున్నారు. ఇందులో 90 శాతం విజయం సాధించారు. కాంగ్రెస్‌ ను వీక్‌ చేయడంలో విజవంతమయ్యారు. ఆ పార్టీని ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం చేయగలిగారు. మిగతా పది శాతం సక్సెస్‌ సాధిస్తే 100 సాధించినట్లే. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఆటంకంగా మారుతున్నాయి. అది బెంగాల్‌లో మమతాబెనర్జీ రూపంలో, తమిళనాడులో స్టాలిన్‌ రూపంలో, ఢిల్లీలో కేజ్రీవాల్,  తెలంగాణలో కేసీఆర్‌ రూపంలో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను ఇప్పుడు బీజేపీ టార్గెట్‌ చేసింది.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బీజేపీ మింగేస్తుందనే ఆందోళన కేసీఆర్‌లో కనిపిస్తోంది.

Also Read: World Most Polluted Cities 2022: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా.. ఢిల్లీ ఫస్ట్

కుటుంబ పాలన, ఉచిత హామీలుపై వద్దంటూ..
ప్రధాని నరేంద్రమోదీ కుటుంబపాలనను చాలాకాలంగా టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. మొదట అస్త్రాన్ని కాంగ్రెస్‌పై పయోగించి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపైనా ఇదే అస్త్రం ప్రయోగించబోతున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ కేంద్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీ వారసత్వ అస్త్రం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలే ఉచిత హామీలు ఎక్కువగా ఇస్తున్నాయి. స్థానికంగా ఉండే పార్టీలకు జాతీయవాదం, దేశం ప్రజలపై ఎక్కువగా దృష్టి ఉండదు. స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు. వారికి ఎలాంటి హామీలు ఇస్తే ఎన్నికల్లో గెలుస్తాం అనే విషయాలే ఆలోచిస్తాయి. ఈ క్రమంలోనే అనేక ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో మోదీ తాజాగా ఉచితాలు దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది. ఉచిత హామీలు ఇవ్వకుండా కట్టడి చేస్తే ప్రాంతీయ పార్టీల మనుగడకు ఆటంకం తప్పదు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన ఆమ్‌ ఆద్మీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ,డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఉచిత హామీలు వద్దనడంపై విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఉచితాల రద్దు భయం వెంటాడుతోంది.

KCR vs Modi
KCR vs Modi

మోదీనే ఎస్టాబ్లిష్‌ చేస్తున్న కమలనాథులు..
ఇక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ  ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే ప్రచారం చేస్తూ బలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణలో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్రలో ఆయన కేంద్ర పథకాలు, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ప్రధాని నరేంద్రమోదీ పాలనతో దేశం ఎలా ముందకు వెళ్తోంది. రాష్ట్రంలోనూ ఆయన సారథ్యంలోనే అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అదిచేస్తాం, ఉచితంగా ఇది ఇస్తాం అని హామీలు ఇవ్వడం లేదు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశమంతటా (ఉత్తరప్రదేశ్‌ మినహా) బీజేపీ నాయకులు మోదీనే ఎస్టాబ్లిష్‌ చేస్తున్నారు. మోదీని చూపే ఓట్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో మోదీనే టార్గెట్‌ చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

తన శత్రువును రాష్ట్ర ప్రజల శత్రువుగా ఆపాదించే ప్రయత్నం..
బీజేపీ విజయ యాత్రకు ఆటంకంగా మారుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నంలో ప్రధాని మోదీ ఉండగా, దీనిని గ్రహించిన కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్, పార్టీ మనుగడం కోసం తనకు, తన పార్టీకి శత్రువుగా మారుతున్న నరేంద్రమోదీని తెలంగాణ ప్రజలకు శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానే తెలంగాణకు శత్రువు అనే వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే కేసీఆర్‌ ఈ ప్రకటన ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లకుండా తెలంగాణకు రుణాల విషయంలో కేంద్రం కల్పిస్తున్న ఆటంకాలు, జాతీయ ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, గతంలో మంజూరైన ప్రాజెక్టులు రద్దు చేయడం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు వెనుకాడడం, గిరిజన యూనివర్సిటీ హామీ నెరవేర్చకపోవడం, విభజన చట్టంలోని హామీలను విస్మరించడం, మెడికల్‌ కాలేజీలు, నవోదయ పాఠశాలల మంజూరులో వివక్షను కారణంగా చూపుతున్నారు. ఈ కారణాల చూపడం ద్వారా మోదీ తెలంగాణకు శత్రువు అనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. మరి ఇది సక్సెస్ అవుతుందా? మోడీని విలన్ ను చేస్తుందా? కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుతాయా? అన్నది వేచిచూడాలి.

Also Read:Team India New jersey : 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా టీమిండియా కొత్త జెర్సీ.. వైరల్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version