కరోనా వ్యాప్తితో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా మూతబడి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరంతా గతంలో నిర్వహించిన విధంగానే వ్యాపార కార్యక్రమాలు పునః ప్రారంభించు కునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాలను పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. లాక్ డౌన్ నిబందనలు సడలించిన నేపధ్యంలో ఈ నెల 8 నుంచి టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూం లను ముఖ్యమంత్రి జగన్ వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నారని చెప్పారు.
కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభమైన తర్వాత బోట్లను పునరుద్దరిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారమే నడుచుకొనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ పట్టణాల్లో హోటల్లు, రెస్టారెంట్లను 8 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎపిలో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అన్ని వనరులున్నాయన్నారు. టెంపుల్ టూరిజం ను ప్రోత్సహిస్తున్నామని, యాత్రికులకు కావాల్సిన హోటల్లు, రెస్టారెంట్లు అన్నీ సిద్దంగా ఉంచామని తెలిపారు. ఇతర టూరిస్టులకు కరోనా దృష్ట్యా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
గత సంవత్సరంలో టూరిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని, రాబోయే రోజుల్లో అరకు, మారెడిమిల్లి లాంటి టూరిజం ప్రదేశాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ పెట్టాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి హోటల్స్ బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవచ్చన్నారు.
కరోనా దృష్ట్యా పర్యాటకంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, టూరిస్టులు కరోనా కారణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎపిలో టూరిజం రంగానికి లాక్ డౌన్ ద్వారా మూడు నెలలకు రూ.30 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే వరకు సహజీవనం చేయడమేనన్నారు. ప్రపంచ టూరిజం మ్యాప్ లో ఎపి టూరిజంని ఉంచాలన్నదే లక్ష్యమని చెప్పారు.