Home Guards : ప్రజలందరూ న్యాయం కోసం రక్షక భటులను ఆశ్రయిస్తాం.. కానీ ఆ భటులే న్యాయం కోసం రోడ్డు ఎక్కితే.. ప్రభుత్వంపై పోరాడితే ఇక తెలంగాణలో న్యాయం అనేది ఎండమావి అని అర్థమైపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణ హోంగార్డ్స్ తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రోడ్డెక్కారు. రక్షక భటులుగా ఉండాల్సిన వీరే.. ధర్నాలు, నిరసనలు అడ్డుకోవాల్సిన వీరే ఇలా ఆందోళన చేయడం అందరినీ ఆలోచింపచేసింది. ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది.
హైదరాబాద్ ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద హోంగార్డ్స్ ఆందోళనతో ప్రభుత్వం పరువుపోయినట్టైంది. తమను ఎందుకు పర్మనెంట్ చేయడం లేదని. కేసీఆర్ హామీని ప్రశ్నిస్తూ హోంగార్డ్స్ ధర్నా, నిరసన చేపట్టడం ప్రభుత్వం తలకొట్టేసినంత పని అయింది. పోలీసుల్లో భాగం.. కింది స్థాయి రక్షక భటులుగా పేరొందిన హోంగార్డ్స్ ఇలా ఆందోళన చేయడం సంచలనమైంది.
కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాలు అమలు చేయాలని.. హోంగార్డ్స్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారంతా ధర్నాకు దిగారు. అలాగే రిటైర్మెంట్ అయిన హోంగార్ట్స్‌కు రూ.10 లక్షలు నగదుతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు. అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిన హోంగార్డ్స్‌ను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే తమ తోటి రక్షక భటులు అని పోలీసులు వదల్లేదు. అందరినీ అరెస్ట్ చేసి చెట్టుకొకరు పుట్టకొకరిని తరలించి అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టేశారు. ఇలా న్యాయం చేయాల్సిన వారే రోడ్డెక్కిన దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. తెలంగాణలో అంతే బై అని ఊరుకోవడం హోంగార్డ్స్ వంతైంది.