AAP MP Raghav Chadha: పాములు పగపడతాయని సినిమాల్లో ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. వార్తల్లోనూ చదివే ఉంటాం. కానీ విచిత్రంగా ఓ వ్యక్తిని, అది కూడా ఒక పార్లమెంటు సభ్యుడిని కాకి పగబట్టింది. అంతేకాదు ఆయనపై దాడి చేసింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ కాకి ప్రస్తావన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇంతకీ ఏమిటా కాకి? ఎవరా ప్రజా ప్రతినిధి? మీరూ చదివేయండి.
చడి చప్పుడు లేకుండా దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ తెలుసు కదా.. దానికి రాఘవ్ చద్దా అనే ఒక పార్లమెంట్ సభ్యుడున్నాడు. ప్రస్తుతం పార్లమెంట్లో మణిపూర్ సంఘటనకు సంబంధించి వాడి వేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం పార్లమెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన తనకు ఫోన్ రావడంతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏదో సీరియస్ అంశం మీద ఫోన్లో చర్చిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఆకస్మాత్తుగా ఒక కాకి అక్కడ ప్రత్యక్షమైంది. రాఘవ్ మీద చడి చప్పుడు లేకుండా దాడి చేసింది. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీటిని ఓ వార్త సంస్థ ప్రచురించింది. ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
అబద్ధాలు చెప్పినందుకే..
రాజ్యసభ నుంచి రాఘవ్ వెలుపలికి వస్తుండగా ఆయనపై ఈ కాకి దాడి జరిగింది. కాకి దాడి చేస్తున్నట్టు గుర్తించిన ఆయన దాని నుంచి తప్పించుకునేందుకు కొంచెం వంగారు. కాగా, ఈ దృశ్యాలను బిజెపి ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. పార్లమెంట్లో అబద్ధాలు చెప్పినందుకే కాకి ఇలా దాడికి ఇలా దాడి చేసిందంటూ ఎగతాళి చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక హెచ్చరిక అంటూ చురక అంటించింది.. కాగా, కాకి దాడికి గురైన రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు పరామర్శించారు.